కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) ప్రతిరోజూ ఒక ప్రాంతంలో ‘కేఎన్నార్ మార్నింగ్ వాక్’ (KNR Morning Walk) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేడియానికి వచ్చే వాకర్స్, క్రీడాకారులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం, ఆయన మాట్లాడుతూ.. తాను సుడా చైర్మన్ గా ఉన్న సమయంలో అంబేద్కర్ స్టేడియం వాకర్స్, క్రీడాకారుల కోరిక మేరకు ఇచ్చని హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఆనాడు సుడా నిధుల నుండి కేటాయించిన రూ.95 లక్షలతో సింథెటిక్ ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే క్రీడాకారులకు, వాకర్స్ కు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
స్టేడియంలో మరుగుదొడ్లు చెడిపోయి వాకింగ్ కు వచ్చే మహిళలు, వృద్ధులు, షుగర్ పేషెంట్లు, క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాకర్స్ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన, సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు రోజులలో పనులు ప్రారంభించి మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రతిరోజూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేఎన్నార్ మార్నింగ్ వాక్ ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల వద్దకు వెళ్తానని, వారి సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

