నల్లగొండలో మట్టి స్కామ్.. బైపాస్ పేరుతో భారీ దోపిడీ!

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ బైపాస్ రోడ్డు (Nalgonda Bypass Road) రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. సాక్షాత్తూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇలాకాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు ప్రకృతి వనరుల దోపిడీ, మరోవైపు నాణ్యత రాజీ ఆరోపణలను ఎదుర్కొంటున్నది. రూ.516 కోట్లతో 14 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నారు. అయితే.. అనుమతులకు మించి జలవనరులు, ప్రభుత్వ భూముల నుంచి రూ.140 కోట్ల విలువైన మట్టిని తవ్వేసి, రాయల్టీ ఎగవేయడమే కాకుండా, చౌడు, బంక మట్టినే రోడ్డు పునాది పనుల్లో వినియోగిస్తూ దాని భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారనే తీవ్ర విమర్శ వస్తున్నది.

సహజ సంపద తరలింపుతో పాటు ప్రభుత్వ ఖజానాకు నష్టం, నాసిరకం మట్టితో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడతాయని విపక్ష పార్టీల డిమాండ్ వినిస్తున్నది. అయితే అనుమతులకు మించి తవ్వకాలు చేస్తున్నారని, రోడ్డు నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినా జిల్లా యంత్రాంగం మౌనంగా ఉంటుందని, రూ. కోట్ల విలువైన మట్టి తరలింపు వెనుక ఓ మంత్రి మద్దతు ఉందంటూ ప్రతిపక్ష పార్టీ నేరుగా కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ మరింత వేడెక్కింది.

రూ.140 కోట్ల లెక్క తేలేదెలా ?

జాతీయ రహదారి -565 (నకిరేకల్ – నాగార్జునసాగర్)పై పానగల్ నుంచి మర్రిగూడ జంక్షన్, శివారు, కత్తల్‌గూడ, దేవరకొండ రోడ్డు మీదుగా ఎస్ఎల్బీసీ సమీపంలో సాగర్ రోడ్డును కలిపేలా నాలుగు లేన్లతో బైపాస్‌ (Nalgonda Bypass Road) నిర్మిస్తున్నారు. రోడ్డు పనుల్లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారంటూ తాజాగా నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఏకంగా కేంద్ర కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ఫిర్యాదు చేయడం స్థానికంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది.

ప్రభుత్వ భూములు, చెరువులు, జలవనరులు లక్ష్యంగా బుద్ధారం, దీపకుంట, పానగల్ చెరువు, ఉదయ సముద్రం జలాశయ కాల్వలతో పాటు స్మృతివనం, శ్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో మట్టిని తవ్వినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 2 లక్షల టిప్పర్ లోడ్ల మట్టిని తరలించారని, స్థానిక మార్కెట్ ధరలో ఒక్కో లోడుకు రూ.7 వేల చొప్పున మొత్తం విలువ రూ.140 కోట్ల వరకు ఉంటుందని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 60 అడుగుల లోతు వరకు భారీ గుంతలు తవ్వారని, భవిష్యత్తులో వాటితో పర్యావరణ, భద్రతా పరమైన ప్రమాదాలకు దారితీసేలా ఉందని వివరించారు.

ఇంత భారీ స్థాయిలో సహజ వనరుల తరలింపు జరిగినప్పుడు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా..? ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ లేదా సీనరేజ్ ఫీజులు సక్రమంగా జమ అయ్యాయా అని ప్రశ్నలు లేవనెత్తుతూ.. రవాణా రికార్డులు, అనుమతి పత్రాలు, తవ్విన ప్రాంతాల కొలతల ఆధారంగా సమగ్ర సర్వే, స్వతంత్ర ఆడిట్ నిర్వహిస్తేనే ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపై స్పష్టత వస్తుందని ఆయన ఫిర్యాదులో స్పష్టంచేశారు.

రోడ్డు పునాదిలో చౌడు, బంక మట్టి..!

హై వేల నిర్మాణంలో పునాది స్థాయి ఎంతో కీలకమైనది. కానీ, పానగల్ చెరువు నుంచి తీసిన చౌడు మట్టిని, ఇతర చెరువుల నుంచి తీసిన బంక మట్టిని రోడ్డు పునాదిలో వినియోగించారనే ఆరోపణలు ఇంజనీరింగ్ నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా చౌడు, బంక మట్టికి నీటిని పీల్చుకుని ఉబ్బే స్వభావం, ఎండినప్పుడు పగుళ్లు ఇచ్చే గుణం ఉంటుంది. అలాంటి మట్టిని రోడ్డు నిర్మాణంలో వాడితే కొద్దికాలంలోనే కుంగిపోయి ప్రమాదాలకు అవకాశం ఉంటుంది.

దీనికితోడు మట్టి పొరల కింద పెద్ద బండరాళ్లు వేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. జాతీయ రహదారి ప్రమాణాల ప్రకారం వేయాల్సిన జీఎస్‌బీ, డబ్ల్యూఎంఎం పొరల మందం, నాణ్యత నిర్దేశిత స్థాయిలో ఉన్నాయో లేదో తేల్చాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం స్వతంత్ర ప్రయోగశాలల ద్వారా మట్టి, నిర్మాణ సామగ్రి నమూనాలను పరీక్షించడం అత్యవసరం. పానగల్ ఉదయ సముద్రం చెరువు గేట్ల ముందు నుంచి భారీ స్థాయిలో మట్టిని తరలించిన తవ్వకాలు గుర్తులు నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి.

రాజకీయ అండదండలపై ఆరోపణలు

ఈ అక్రమ తవ్వకాలు, నాణ్యతా లోపాలపై గతంలోనే కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై ఎలాంటి లిఖితపూర్వక నివేదిక అందలేదని ఫిర్యాదులో బీజేపీ నేత పేర్కొన్నారు. మరోవైపు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతుతోనే ఈ పనులు కొనసాగాయంటూ రాజకీయ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత మంత్రి ఆదేశాలు, అధికారుల మధ్య జరిగిన సమాచార మార్పిడిని పరిశీలించి, వాస్తవ ఆధారాల మేరకు బాధ్యులను గుర్తించాలని కేంద్ర మంత్రిని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏకంగా రాష్ట్ర మంత్రి పాత్ర ఉందంటూ ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>