బాల్య దశ అందమైన జ్ఞాపకం: రిజ్వాన్ బాషా షేక్

కలం, జోగులాంబ గద్వాల: ప్రతి ఒక్కరి జీవితంలో బాల్య దశ అందమైన జ్ఞాపకమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) అన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని బాగా చదువుకోవాలని, బాలల జీవితాన్ని తీర్చిదిద్దేది విద్యాలయాలేనని స్పష్టం చేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించిన వారోత్సవాల ముగింపు వేడుకలను శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. మై డే, మై రైట్స్, మై ఫ్యూచర్ థీమ్ తో నిర్వహించిన వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ కు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

బాల్య వివాహాలు నిరోధించాలి..

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. గట్టు, కేటీ దొడ్డి, మల్దకల్ ప్రాంతాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా తోడ్పడాలని కోరారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడంతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. విద్యాసంస్థల్లో ఛైల్డ్ సేఫ్టీ అధికారులను నియమించడమే కాక దిశ, సఖి కేంద్రాలు, ఛైల్డ్ ప్రొటెక్షన్, ఉమెన్ సేఫ్టీ విభాగాలు బాలల, మహిళల సంరక్షణకు కృషి చేస్తున్నాయన్నారు. బాలల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వంతోపాటు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా కృషి చేస్తున్నాయన్నారు. బాలలు ఏమైనా సమస్యలు వస్తే ఛైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ 1098కు ఫోన్ చేసి తెలుపవచ్చన్నారు.

ఫోన్ల వాడకం తగ్గించాలి..

విద్యార్థులు చదువు, ఇతర సాంకేతిక అంశాలను తెలుసుకునేందుకే ఫోన్లు వాడాలి తప్ప గేమ్స్ ఆడొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. అనవసరమైన వీడియోలు, రీల్స్ చూసేందుకు ఫోన్స్ ఎక్కువగా వినియోగించడం వలన కంటి చూపు మందగించడం, మానసిక, నిద్రలేమి, తదితర సమస్యలు వస్తాయన్నారు. చంటి పిల్లలు కూడా ఫోన్లు చూడనిదే అన్నం తినడం లేదని, చిన్నతనంలోనే ఫోన్లకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా గుడ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించాలని సూచించారు. అక్కడక్కడ బాలికలపైనే కాకుండా బాలురపైన కూడా వేధింపుల ఘటనలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి..

ఇటీవల కాలంలో మార్కెట్‌లో ఆకర్షనీయమైన ప్యాకింగ్ లతో రకరకాల జంక్ ఫుడ్ పిల్లలను ఆకట్టుకుంటున్నాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. వీటిని తినడం వలన అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని, ఇంట్లో చేసిన ఆహారాన్ని తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిల్లల శారీరక వృద్ధికి, జ్ఞాపకశక్తి పెరిగేందుకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.

విద్యార్థులు సెలవులు ముగిశాక వెంటనే తిరిగి పాఠశాలలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని, బద్ధకించడం వలన విలువైన పాఠాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. అనంతరం వారోత్సవాలను పురస్కరించుకొని పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్, ఇతర అతిధులు బహుమతులను అందజేశారు. అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదనపు కలెక్టర్ మధుమోహన్, అదనపు ఎస్పీ శంకర్, డీడబ్ల్యుఓ సునంద, డిఈవో విజయలక్ష్మి, డీఐఈఓ హృదయ రాజ్, డీసీపీవో నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>