కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పలు ఆరోగ్య సూచికల్లో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అద్భుత ప్రగతి కనబరిచింది. అనేక కీలక అంశాల్లో జిల్లా ముందంజలో నిలవడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన అన్ని ఆరోగ్య సూచికల్లో జిల్లా మంచి ప్రగతి సాధిస్తున్నందుకు అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో అన్ని సూచికల్లోనూ 100 శాతం లక్ష్యాలు సాధించాలని నిర్దేశించారు.
శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో 33 జిల్లాల వైద్యాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. ఈ సమీక్షలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐ ఎఫ్ ఏ పంపిణీ, HPV వ్యాక్సినేషన్ మరియు సికిల్ సెల్ ఇండికేటర్లలో మాత్రమే కొంత వెనుకబాటు ఉన్నట్లు గుర్తించారు.
ఈ మూడు అంశాల్లో నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించి వేగం పెంచాలని కమిషనర్ సూచించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు, పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఇకపై ప్రతి నెలలో రెండుసార్లు జూమ్ సమావేశాలు నిర్వహిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారులు డాక్టర్ తుకారామ్ రాథోడ్, డాక్టర్ సైదులు, డాక్టర్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

