కరీంనగర్ అభివృద్ధికి 10 కీలక తీర్మానాలు

కలం, కరీంనగర్ బ్యూరో : నగర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అధ్యక్షతన కరీంనగర్ నగరపాలక సంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశం శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో 10 కీలక ఎజెండా అంశాలపై చర్చించి పాలకవర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర గేయం, వందేమాతరం గీతంతో ప్రారంభమైన సభ మధ్యాహ్నం 1:30 గంటలకు జాతీయ గీతంతో ముగిసింది.

సభలో ప్రధాన తీర్మానాలు.. కీలక నిర్ణయాలు

జరిమానాల కొరడా : ‘ఎల్ నినో’ ప్రభావం దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు. నిర్లక్ష్యంగా నీటిని వృథా చేస్తే రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా విధించేందుకు ఆమోదం తెలిపారు. అలాగే, కరీంనగర్‌ను ‘ప్లాస్టిక్ ఫ్రీ’ నగరంగా మార్చేందుకు ఫంక్షన్ హాళ్లు, ఇతర వాణిజ్య ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించాలని తీర్మానించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి కూడా జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు.

ఇంకుడు గుంతలకు శ్రీకారం : భూగర్భ జలాల పెంపు కోసం నగరంలోని 66 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు రూ.2 లక్షల చొప్పున నిధులు కేటాయించి ఇంకుడు గుంతల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లలో వీటిని నిర్మిస్తారు. నూతన భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణ అనుమతులకు ఇంకుడు గుంత తప్పనిసరి నిబంధనగా పెట్టారు.

కార్మికుల పెంపు, లీకేజీల నివారణ: పెరిగిన నగర విస్తీర్ణం, జనాభాకు అనుగుణంగా సీడీఎంఏ నిబంధనల ప్రకారం ఒక్కో డివిజన్‌కు ఒక పారిశుధ్య కార్మికుడిని అదనంగా నియమించుకునేందుకు తీర్మానించారు. నగరంలో నీటి పైప్‌లైన్ లీకేజీల నివారణకు గతంలో తొలగించిన 55 మంది లీకేజీ లేబర్లను తిరిగి నాలుగు నెలల పాటు నియమించుకునేందుకు సభ ఆమోదం తెలిపింది.

వీధి దీపాలు, వార్డు కార్యాలయాలు: వీధి దీపాల నిర్వహణ కోసం ఐదేళ్ల వారంటీతో రూ.70 లక్షలు, రూ.95 లక్షల విలువైన కొత్త లైట్ల కొనుగోలుకు టెండర్ ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ స్థలాలు ఉన్న అన్ని డివిజన్లలో వార్డు కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నారు.

పన్నుల పెంపు ఉండదు: పెండింగ్‌లో ఉన్న 47 వేల అసెస్‌మెంట్లకు ‘భువన్ సర్వే’ కొనసాగుతోందని, ప్రస్తుత నిర్మాణాల ప్రకారమే పన్ను సవరణ (ట్యాక్స్ రివిజన్) ఉంటుందని, ఎవరికీ పన్నులు పెంచబోమని మేయర్ స్పష్టం చేశారు. చేయూత పింఛన్ల కింద వచ్చిన 6 వేలకు పైగా దరఖాస్తుల్లో ఇప్పటివరకు 3,812 మంజూరు పత్రాలు అందించామని, మిగిలినవి త్వరలోనే అందుతాయని తెలిపారు.

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

ప్రశ్నోత్తరాల సమయంలో కార్పొరేటర్లు అంతర్గత రహదారుల మరమ్మతులు, తాగునీరు, పారిశుధ్యం, కుక్కలు, కోతుల బెడద వంటి సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. వీటిపై స్పందించిన మేయర్ కొలగాని శ్రీనివాస్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>