కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలోని వివిధ వృత్తి సంఘాల భవన నిర్మాణాలకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju) తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.30 లక్షలు మంజూరు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) చేసిన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన ఎంపీ, మూడు వృత్తి సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో నిధుల మంజూరు వివరాలను వెల్లడించి, ఆయా సంఘాల బాధ్యులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
నగరంలోని వివిధ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సంఘాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ నిధులను మంజూరు చేశారు. తీగలగుట్టపల్లి ప్రాంతంలోని నాయీ బ్రాహ్మణ సంఘం భవనంలో మిగిలిన నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రూ.10 లక్షలు, ఐటీ టవర్ పక్కన ఫోర్ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు, ఎలక్ట్రిషన్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి మరో రూ.10 లక్షలు కేటాయించారు. మొత్తంగా మూడు సంఘాలకు రూ.30 లక్షల ఎంపీ లాడ్స్ నిధులు మంజూరయ్యాయి.
వివిధ వృత్తి సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, వృత్తిపరమైన కార్యక్రమాలు చేపట్టడానికి, సంఘ కార్యకలాపాలను కొనసాగించడానికి సొంత భవనాలు అవసరమని గుర్తించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆయా సంఘాల ప్రతినిధుల అవసరాలు, సమస్యలను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లారు. సంఘాల భవన నిర్మాణాలకు ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించారు. ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించి రూ.30 లక్షలు మంజూరు చేసిన ఎంపీ రవిచంద్రకు గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వివిధ వృత్తి సంఘాల అభివృద్ధి, వాటి సభ్యుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. సంఘాలకు సొంత భవనాలు అందుబాటులోకి వస్తే సభ్యులంతా ఒకచోట సమావేశమై తమ వృత్తిపరమైన అంశాలపై చర్చించుకోవడంతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని అన్నారు. ఆయా సంఘాల అవసరాలను గుర్తించి నిధులు మంజూరు చేసిన ఎంపీ రవిచంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని, వృత్తి సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటామని తెలిపారు. ఎంపీ లాడ్స్ నిధుల సహకారంతో ఆయా సంఘాల భవన నిర్మాణాలు పూర్తయ్యేందుకు దోహదం కలుగుతుందని పేర్కొన్నారు.

