కలం, ఖమ్మం బ్యూరో: విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు రక్షణగా నిలవాల్సిన ఓ ఉపాధ్యాయుడు, గురువు ముసుగులో కీచకుడిగా మారాడు. పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఖమ్మం (Khammam) నగరంలోని పాకబండ బజార్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ నిందితుడిపై ‘పోక్సో’ అస్త్రాన్ని ప్రయోగించారు.
కొణిజర్ల (Konijerla) మండలానికి చెందిన భూక్యా నాగేశ్వర్, ఖమ్మం పాకబండ బజార్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PET) పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతడు పాఠశాలలోని 6వ తరగతి బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తీవ్ర భయాందోళనకు గురైన చిన్నారి అదే రోజు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో బాధిత తల్లిదండ్రులు వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని కలిసి ఫిర్యాదు చేయగా, బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపించారు.
అయితే యాజమాన్యం చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడంతో పాటు, నిలదీసిన సమయంలో పీఈటీ ఎదురుతిరిగి బుకాయించడంతో తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో గురువారం బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి పాఠశాలకు వెళ్లారు. ఆ సమయంలో నిందితుడు పాఠశాలలో అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పాఠశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఉద్రిక్తత సమాచారం అందుకున్న ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజా లక్ష్మి వెంటనే పాఠశాలకు చేరుకుని ఘటనపై విచారణ జరిపారు.
పీఈటీ అందుబాటులో లేకపోవడంతో మాట్లాడలేకపోయామని, ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. మరోవైపు, బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మైనర్ బాలికపై జరిగిన నేరాన్ని తీవ్రంగా పరిగణించిన ఖమ్మం (Khammam) వన్ టౌన్ పోలీసులు నిందితుడు భూక్యా నాగేశ్వర్‌పై కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read : దమ్ముంటే నా మీద పోటీ చేయాలి.. సీఎంకు హరీశ్ రావు సవాల్
Follow Us On : WhatsApp

