కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగిని విధులకు అనుమతించలేదన్న ఆరోపణలతో అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల నాయకులు కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉద్యోగిని వెంటనే విధుల్లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గత రెండేళ్లుగా టీసీఎస్‌లో పనిచేస్తున్న మణీష్ అనే ఉద్యోగి అయ్యప్ప దీక్ష చేపట్టారు. ఈ విషయాన్ని రెండు నెలల ముందుగానే కంపెనీ యాజమాన్యానికి తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే, దీక్షలో భాగంగా సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరుకాగా, డ్రెస్ కోడ్ నిబంధనల పేరుతో తనను కార్యాలయంలోకి అనుమతించలేదని ఆరోపించారు.
కంపెనీలో ఇతర ఉద్యోగులు కూడా డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించకుండా వస్తున్నప్పటికీ వారిని అనుమతిస్తున్నారని, తన విషయంలో మాత్రం వివక్ష చూపుతున్నారని మణీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు కంపెనీ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని ఆదిభట్ల పోలీసులు తెలిపారు. ఉద్యోగి చేసిన ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని స్పష్టం చేశారు.

