పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఆలోచనా శక్తి: కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డితో కలిసి సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పూజించారు. అనంతరం అక్కడ హాజరైన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ ఏడాది జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ఇతివృత్తం ‘ఫైండ్ యువర్ జాయ్’ అని, పుస్తక పఠనం ద్వారా మనకు ఆనందాన్ని, స్ఫూర్తిని ఇచ్చే అంశాలను అన్వేషించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు పాఠశాలల్లో చదివే పాఠ్యపుస్తకాలతో పాటు అదనంగా ఏమైనా పుస్తకాలు చదువుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రోజూ కనీసం 10 నుంచి 20 పేజీలైనా ఇతర పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని కోరారు. ఒక మంచి పుస్తకాన్ని రచించడానికి రచయితలు ఎన్నో సంవత్సరాల సమయాన్ని వెచ్చిస్తారని, తమ జీవిత అనుభవాలు, దశాబ్దాలుగా సంపాదించిన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో అందిస్తారని వివరించారు.

విద్యార్థులు తమ జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టే విషయాలను ఒక పుస్తకం చదవడం ద్వారా తక్కువ సమయంలోనే తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి కనీసం మూడు నెలల్లో మూడు పుస్తకాలు చదవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రోజూ కొంత సమయం కేటాయించి చదవాలని, ఒక పుస్తకాన్ని పూర్తి చేయడానికి నెల లేదా రెండు నెలలు పట్టినా ఇబ్బంది లేదని, పఠనం మాత్రం నిరంతరం కొనసాగాలని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో ప్రతి ఆదివారం జిల్లా గ్రంథాలయానికి వచ్చి కనీసం రెండు గంటల పాటు పుస్తకాలు చదవాలని సూచించారు. మెట్టుగడ్డ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్, కార్యదర్శి, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>