మంథనిలో దీక్షా దివస్‌ సన్నాహక భేటీ

కలం, మంథని: ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోరాట స్ఫూర్తిని నేటి యువతరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. నవంబర్‌ 29న కరీంనగర్‌ జిల్లా అలుగునూర్‌లో నిర్వహించనున్న ‘దీక్షా దివస్‌’ బహిరంగ సభ సన్నాహక సమావేశం మంథని (Manthani) పట్టణంలోని బీఎస్‌ బాంకెట్‌ హాల్‌లో పుట్ట మధూకర్‌ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సమావేశంలో బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంశం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ‘కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ఆనాడు కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన అలుగునూర్‌ ప్రాంతంలోనే ఈ నెల 29న దీక్షా దివస్‌ నిర్వహిస్తున్నామని, ఈ సభకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. సమైక్యాంధ్ర పాలనలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఉద్యమకారులను అణచివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇసుక లారీలను ఆపుతామని చెప్పిన ఆయన ఇప్పుడు ఇసుక దందాను నడిపిస్తున్నారని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్‌ చేసిన త్యాగాలు నేటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో అలుగునూర్‌లో భారీ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సభకు మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>