కలం, దస్తూరాబాద్: గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) అన్నారు. గురువారం దస్తూరాబాద్ మండలం అకొండపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ భవనాలు గ్రామ పరిపాలనకు కేంద్రాలుగా నిలుస్తాయని, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేందుకు దోహదపడతాయని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అవసరమైన నిధులు, సదుపాయాలు కల్పిస్తోందన్నారు. అనంతరం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం గురించి వివరించారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని, అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భరోసా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

