కలం, వెబ్ డెస్క్: గత పదేళ్ల పాలనలో సాగునీటి విషయంలో చేసిన తప్పిదాలను, రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకుఏ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కొత్తగా నీతులు చెబుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆరేనని, కళ్యాణ లక్ష్మీ, సీఎంఆర్ఎఫ్, షాదీ ముబారక్ పథకాల బిల్లుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని అన్నారు.
తెలంగాణ నీటి వాటా విషయంలో ఎలాంటి రాజీ ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రయోజనం శూన్యమని మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణ నీటి వాటా తరలివెళ్లకుండా సమర్థవంతంగా అడ్డుకున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో ఒప్పుకున్నదే బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు.
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తాము వరుసగా లేఖలు రాశామని, తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన బలమైన అభ్యంతరాల వల్లే ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఆగిపోయాయని ఆయన వివరించారు. బీఆర్ఎస్ నేతలు వాస్తవాలను దాచి పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టిందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు ఎంతో మేలు జరిగేదని, కానీ గత పాలకులు తమ స్వార్థం కోసం కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు.
Also Read : రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్!
Follow Us On: Youtube

