కలం, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని తరలించే కుట్ర కేసీఆర్ (KCR) తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడే మొదలైంది. ‘పల్నాడు డ్రింకింగ్ వాటర్ సప్లై’ ప్రాజెక్టు (Palnadu Water Grid Project) పేరుతో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఉన్న 363 గ్రామాలకు తాగునీటిని అందించాలనే పేరుతో 2022 ఫిబ్రవరి 16న జీవో (నెం.56) పంచాయతీరాజ్ డిపార్టుమెంట్ ద్వారా విడుదలైంది. అప్పటికే తెలంగాణ సీఎం కేసీఆరే ఉన్నారు.
మొత్తం రూ.1,200 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద రూ.500 కోట్లను ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.500 కోట్లను భరించాలి. మిగిలిన రూ.200 కోట్లను 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి విడుదల చేసేలా జీవోలో అప్పటి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఆ జీవో విడుదలైన తర్వాత 2023 డిసెంబర్ వరకు తెలంగాణ సీఎంగా, ఇరిగేషన్ మంత్రిగా కేసీఆరే ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు విషయంలో మౌనంగానే ఉన్నారు. కృష్ణా బోర్డుకు సైతం ఫిర్యాదు చేయలేదు.
జగన్ సీఎంగా ఉన్నప్పుడే అంకురార్పణ
వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ప్రాజెక్టు అంకురార్పణ జరిగినా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.500 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరులో ఆలస్యం జరగడంతో ఆశించిన స్థాయిలో పనులు ప్రారంభం కాలేదు. హైడ్రాలిక్ మోడల్, ఇన్‌టేక్ వెల్ ఆప్టిమైజేషన్, ‘రైట్ ఆఫ్ వే’ క్లియరెన్సులు ఫైనల్ కాకుండానే ప్రాథమిక అంచనాలతో టెండర్ల ప్రక్రియ మొదలైంది. అగ్రిమెంట్లు కుదిరినా పనులు ప్రారంభం కాకపోవడంతో జగన్ సీఎంగా ఉన్నంతకాలం పల్నాడు డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.
చంద్రబాబు సీఎం అయ్యాక రివ్యూ
చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 డిసెంబర్ 19, 20వ తేదీల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో జల్‌జీవన్ మిషన్ కింద మంజూరై ప్రారంభం కాని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం టేకప్ చేసిన జల్‌జీవన్ మిషన్ ప్రాజెక్టుల పనులను రద్దు చేయాలని లేదా కొన్నింటిని రీవ్యాంప్ (రీ డిజైన్) చేయాలని నిర్ణయించగా.. అందులో పల్నాడు డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు కూడా ఉంది.
‘అమరజీవి జలధార’గా జనవరి నుంచే పనులు
జగన్ హయాంలో రూపొందించిన ఈ ప్రాజెక్టు (Palnadu Water Grid Project) చివరికి ‘అమరజీవి జలధార’ (జల్‌జీవన్ మిషన్ 2.0) పేరుకు మారిపోయింది. ప్రాజెక్టు రీ-డిజైన్ అయింది. జనవరి థర్డ్ వీక్‌లోనే టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.923.64 కోట్లు, జీఎస్టీ లాంటివి రూ.276.36 కోట్లతో ఫైనల్ అయింది. ఆ తర్వాత పనులు కూడా మొదలయ్యాయి.
పల్నాడు జిల్లాలోని 11 మండలాల (మాచర్ల, వెల్తుర్తి, దుర్గి, కారంపూడి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, వినుకొండ, నూజెండ్ల బొల్లాపల్లి) పరిధిలోని 363 ఆవాసాలకు సుమారు రోజుకు 160 మిలియన్ లీటర్ల చొప్పున తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సంవత్సరానికి 1.865 టీఎంసీల నీటిని తరలించేలా 140 అడుగుల లోతుతో ఇన్‌టేక్ వెల్, సంప్‌లు, నాలుగు అంచెల ఫిల్టర్ వ్యవస్థతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పంప్ హౌజ్‌లు, మూడు రకాల పైప్‌లైన్ నిర్మాణం.. ఇవన్నీ దశలవారీగా జరుగుతున్నాయి. సుమారు 20% మేర పనులు పూర్తయినట్లు ఆ రాష్ట్ర అధికారుల అంచనా.
సాగర్ 510 అడుగుల లెవల్ నుంచే వాటర్ డ్రాయింగ్
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 590 అడుగుల గరిష్ట స్థాయితో సంబంధం లేకుండా 510 అడుగుల నుంచే నీటిని ఇన్‌టేక్ వెల్ ద్వారా పల్నాడు జిల్లా గ్రామాలకు పైప్‌లైన్ ద్వారా తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. భవిష్యత్తులో దీన్ని ఇతర అవసరాలకు కూడా వాడుకునే అవకాశం లేకపోలేదు.
ఇరిగేషన్ ప్రాజెక్టు కానందునే అంతర్ రాష్ట్ర జల వివాదానికి ఆస్కారం లేదని, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు లేదా తెలంగాణకు చెప్పాల్సిన అవసరం లేదన్నది ఏపీ అధికారుల వాదన. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి తాగునీటి పేరుతో ఏపీ తన పరిమితికి మించి నీటిని డ్రా చేస్తున్నదని తెలంగాణ పదేపదే ఆరోపిస్తున్న సమయంలో, సాగర్ డ్యామ్‌కు కుడివైపున ఈ ప్రాజెక్టు చేపట్టడం వివాదానికి దారితీసింది.
ఇంటెలిజెన్స్, ఇరిగేషన్ ఫెయిల్
ఏపీ ప్రభుత్వం 2022 ఫిబ్రవరి 16న జీవో జారీచేసినా, ఆ తర్వాత 2024 డిసెంబర్ 19, 20వ తేదీల్లో జరిగిన కేబినెట్ సమావేశం ఆ ప్రాజెక్టును రీ వ్యాంప్ పేరుతో రద్దు చేసినా.. అదే ఏడాది డిసెంబర్ 21న పంచాయతీరాజ్ జీవో (నంబర్.73) విభాగం జారీచేసినా, అమరజీవి జలధార పేరుతో కొత్త ప్రాజెక్టుకు టెండర్లు పైనల్ చేసినా.. తెలంగాణ ఇంటెలిజెన్స్, ఇరిగేషన్ అధికారులకు సమాచారం లేకపోవడం, ప్రభుత్వాన్ని అలర్టు చేయకపోవడం గమనార్హం.
కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కూడా 20 నెలల పాటు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించకుండా, స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నారు. గతంలో కేసీఆర్ కారణంగానే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలకు పరిమితమై ఒప్పందంపై సంతకం చేసి రాష్ట్రానికి శాశ్వత మరణశాసనం రాశారని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. జగన్ హయాంలోనే జీవో జారీ అయినా అప్రమత్తం కాలేదన్న కొత్త విమర్శను మూటగట్టుకోవాల్సి వస్తున్నది. ఏడాది కాలంగా పనులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డికి సోయి లేదంటూ కేటీఆర్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రెండో టర్మ్ లో సీఎంగా, ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ ఏం చేశారన్న కౌంటర్‌కు తావిచ్చినట్లయియింది.

