కలం, ఉట్నూరు, కడెం : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju) అన్నారు. బుధవారం ఉట్నూరు, కడెం మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో 1,673 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే అర్హులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురువారం నుంచి ఇందిరమ్మ బీమా పథకం కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

