కలం, ఖమ్మం బ్యూరో: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. బుధవారం కల్లూరు (Kallur) పట్టణంలోని వికేఆర్ ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కల్లూరు మండలం, మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంత్రి పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. గత పాలకులు రాష్ట్రంపై రూ.8 లక్షల 21 వేల కోట్ల అప్పుల భారం మోపినప్పటికీ పేదలకు అందించే సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి కోతలు విధించకుండా, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, గత పాలకులు వరి వేస్తే ఉరి అనే తప్పుడు ప్రచారం చేయగా, ప్రజా ప్రభుత్వం సన్న వడ్లు పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తోందన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 72 వేల మందికి నియామక పత్రాలు అందించడంతో పాటు మరో 14 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని, భవిష్యత్తులో నిరుద్యోగ యువత కోసం మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేదలకు సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయని పరిస్థితి ఉండగా, ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు 33 నెలల్లో రూ.73 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బస్సులు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ వంటి అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు:
పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, రెండవ విడతలో 2.5 లక్షల ఇళ్లు, హైదరాబాద్ ప్రాంతంలో మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పేదింటి మహిళలు సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, మూడవ, నాలుగవ విడతల్లోనూ ఇళ్లను అందిస్తామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 21 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. దీపావళి పండుగ సందర్భంగా లబ్ధిదారులు తమ ఇందిరమ్మ ఇళ్లలో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారని తెలిపారు. నవంబర్ నెలాఖరు నాటికి ఇందిరమ్మ ఇళ్లకు చివరి విడత బిల్లులు విడుదల చేస్తామని వెల్లడించారు.
నాలుగున్నర లక్షల నూతన పెన్షన్లు మంజూరు:
గత పాలకులు పేదలకు ఇళ్లు మంజూరు చేయడం వల్ల తమకు ఏం ప్రయోజనం ఉంటుందని భావించి, పేదల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు. భర్తను కోల్పోయి పది, పన్నెండు సంవత్సరాలు గడిచినప్పటికీ అనేకమంది వితంతువులకు గత ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయలేదని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకులు పేదల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల కోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రతిపక్ష నాయకులైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లోనూ ఎలాంటి వివక్ష లేకుండా ఇందిరమ్మ ఇళ్లు, నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు కేవలం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే పథకాలు అమలు చేశాయని, ప్రజా ప్రభుత్వం ఎలాంటి రాజకీయ వివక్ష చూపదని తెలిపారు. ముఖ్యమంత్రి నియోజక వర్గంలో అమలయ్యే సంక్షేమ పథకాలే దళిత, గిరిజన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లోనూ సమానంగా అమలవుతాయని స్పష్టం చేశారు.
కల్లూరు మండలం, మున్సిపాలిటీ పరిధిలో సుమారు 1,249 మందికి పాతవి, కొత్తవి కలిపి ప్రతి నెలా సుమారు రూ.2 కోట్ల 18 లక్షలు పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెన్షన్ మంజూరు కాని అర్హులైన వారు నిరుత్సాహ పడవద్దని, అర్హులందరికీ దశలవారీగా పెన్షన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం:
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తూ ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి తెలిపారు. గతంలో బతుకమ్మ చీరలను మహిళలు ధరించని పరిస్థితి ఉండగా, నేడు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంతోషంగా ధరిస్తున్నారని చెప్పారు. సిద్దిపేట నియోజక వర్గంలో ఈసారి చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని, ప్రస్తుతం ఆ నిధులతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎంత ఆక్రోశం వ్యక్తం చేసినా పేదల సంక్షేమ కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను స్వాగతించాలని హితవు పలికారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు పేద ప్రజలకు అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆలోచించి అమలు చేస్తోందన్నారు. మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని, నేడు మహిళలు ఆధార్ కార్డుతో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద ప్రజల వైద్య అవసరాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, గత పాలకులు ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని, ప్రజా పాలనలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం రేషన్ ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించే పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజూ పాలు లేదా రాగిజావ అందించడంతో పాటు మధ్యాహ్న భోజన నాణ్యతను కూడా పెంచామని చెప్పారు. బీసీ, మైనారిటీ విద్యార్థులు అన్ని ఆధునిక సౌకర్యాలతో ఒకే చోట విద్యను అభ్యసించేలా 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు.
నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 72 వేల ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలు అందించామని, మరో 14 వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఆర్థికంగా చేయూత నిస్తే కుటుంబ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని భావించి, గతంలో నిలిచి పోయిన వడ్డీ లేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు.
మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యులకు విద్య నేర్పించే కార్యక్రమాన్ని చేపట్టామని, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో 6 వేల మందికి విద్య అందిస్తున్నామని తెలిపారు. పదవ తరగతి చదివిన మహిళలకు ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా మహిళా సంఘాలను బస్సులకు యజమానులుగా చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు వంటి అనేక రకాల ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు ఇళ్లు అందించారని, ఆ తర్వాత గత పాలకులు పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. తిరిగి ప్రజా ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. కల్లూరు మండలంలో రెండు విడతల్లో మొత్తం 1,040 ఇందిరమ్మ ఇళ్లను పేదలకు మంజూరు చేశామని, ప్రభుత్వం మూడవ, నాలుగవ విడతల్లోనూ ఇళ్లను మంజూరు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు.
రైతు సంక్షేమంలో భాగంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని, రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, రైతులు పండించిన సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో అనేక రోజులుగా పెండింగ్లో ఉన్న పెన్షన్లు నేడు మంజూరు కావడం సంతోషకరమన్నారు. కల్లూరు పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశామని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో ప్రజల నుంచి ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సమస్యలు, నూతన పెన్షన్లకు సంబంధించి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. భూముల రీ సర్వే ద్వారానే భూ సమస్య లకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గుర్తించి దశలవారీగా రీ సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.
పెన్షన్ లబ్ధిదారులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మంత్రి ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఆమోదం తీసుకుని నూతన పెన్షన్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన పెన్షన్లు మంజూరు చేయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
చేయూత పెన్షన్ పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు కొత్త రేషన్ కార్డు, పెన్షన్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. తమకు నూతనంగా పెన్షన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, కల్లూరు మున్సిపల్ ఛైర్మన్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

