కలం, నిర్మల్ : జిల్లాలో అక్రమంగా ఇసుక, మొరం తరలింపును (Illegal Sand, Morram Mining) అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదు. అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొరం తవ్వకాలు, అక్రమ ఇసుక రవాణా తరలింపు యథేచ్ఛగా సాగుతున్నాయి.
సోన్ మండలం న్యూవెల్మల్, లక్ష్మణచాంద మండలం వడ్యాల్ తండా, సారంగాపూర్ మండలం చించోలి (బి), గోపాల్పేట్, నిర్మల్ మండలం రాణాపూర్ గ్రామాల సమీపంలోని గుట్టల నుంచి జేసీబీలతో మొరం తవ్వి ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఈ వ్యవహారం కొనసాగుతున్నా అడ్డుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కెనాల్ కట్టకే ముప్పు..
న్యూవెల్మల్ గ్రామ సమీపంలో సరస్వతి కాలువను ఆనుకుని ఉన్న ప్రాంతం నుంచి మొరం యదేచ్చగా తరలిస్తున్నారు. కాలువ కట్టకు సమీపంలో తవ్వకాలు చేపట్టడం వల్ల కట్ట బలహీనపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో కాలువకు గండి పడిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. అయినప్పటికీ మళ్లీ తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
రాత్రివేళల్లో యథేచ్ఛగా ఇసుక తరలింపు..
గోదావరి నది నుంచి ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. మామడ మండలం కమల్‌కోట్, దస్తురాబాద్ ప్రాంతాల్లోని గోదావరి నది నుంచి ఇసుకను తవ్వి ఒడ్డున డంపు చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళల్లో టిప్పర్లు, లారీల ద్వారా నిర్మల్ పట్టణానికి పెద్దఎత్తున తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పాండవాపూర్, నర్సాపూర్ (డబ్ల్యూ) సమీపంలోని రహదారిపై ఉన్న చెక్‌పోస్టును దాటుకుంటూ పదుల సంఖ్యలో ఇసుక వాహనాలు నిర్మల్‌కు చేరుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి వేళల్లో ఇంత పెద్దఎత్తున ఇసుక రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు అడ్డుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పర్యవేక్షణ ఏదీ?
అక్రమ మొరం తవ్వకాలు, ఇసుక తరలింపును అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, నీటిపారుదల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూములు, గుట్టలు, సాగునీటి కాలువల పరిరక్షణ బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ చర్యలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక తరలింపు, మొరం తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

