కూచిరాజ్‌పల్లి స్కూల్‌ కూల్చివేతపై పుట్ట మధూకర్‌ ఫైర్‌

కలం, మంథని: మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తన విలాసాల కోసం గెస్ట్‌హౌస్‌ నిర్మించేందుకు ప్రభుత్వ పాఠశాలను కూలగొట్టించారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ (Putta Madhukar) విమర్శించారు. మంథని మున్సిపల్‌ పరిధిలోని కూచిరాజ్‌పల్లి (Kuchirajpalli) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, పాఠశాల పరిస్థితిపై ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడారు. ఎంఈఓలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 80 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల పరిస్థితిలో మార్పు రాలేదని కూచిరాజ్‌పల్లి పాఠశాల పరిస్థితి చూస్తే అర్థమవుతుందన్నారు. ఒక కుటుంబానికి 40 ఏళ్ల అవకాశం ఇస్తే పేదల జీవితాలు ఇంకా ఊరి బయటే, పిల్లల చదువులు అరుగులపైనే ఉన్నాయని విమర్శించారు.

బాగున్న పాఠశాలను కూల్చివేసి గెస్ట్‌హౌస్‌ నిర్మించాలని చూస్తున్నారని, అయితే కొత్త పాఠశాలకు స్థలం ఎక్కడ కేటాయించారు? ఎప్పుడు నిర్మిస్తారు? ఎన్ని నిధులు మంజూరు చేశారు? అనే వివరాలు ఎవరికీ తెలియవని అన్నారు. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా నిర్మాణంపై ఎలాంటి ప్రణాళిక లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ పాఠశాలలో ఎక్కువగా ఎస్సీ, బీసీ వర్గాల పిల్లలే చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు విలాసవంతమైన జీవితం గడిపేందుకు అన్ని సౌకర్యాలు కావాలి కానీ, పేద పిల్లలు చదువుకోవడానికి కనీస వసతులు అవసరం లేదా అని ప్రశ్నించారు. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే శ్రీధర్‌బాబు.. కూచిరాజ్‌పల్లి పాఠశాల విషయంలో ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

మంథనికి బీ ఫార్మసీ కళాశాల తీసుకొస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారని, ముందుగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని సూచించారు. బీ ఫార్మసీ కళాశాలలో రాష్ట్రంలోని మెరిట్‌ విద్యార్థులకే అవకాశాలు వస్తే స్థానిక పేద విద్యార్థులకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. గతంలో జేఎన్‌టీయూ కళాశాల ద్వారా ఈ ప్రాంతానికి డ్రగ్స్‌ పరిచయమయ్యాయని కూడా ఆరోపించారు. పేద పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, ఎమ్మెల్యే విలాసాల కోసం గెస్ట్‌హౌస్‌ నిర్మించేందుకు పాఠశాలను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంథనిలోని మేధావులు స్పందించాలని, ప్రజలు ప్రశ్నించకపోవడం వల్లే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని పుట్ట మధూకర్‌ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>