కలం, జడ్చర్ల: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే రీ సర్వే(Land Resurvey) పనులు కొనసాగుతున్నాయని జిల్లా అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భూముల సరిహద్దులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి, భూ రికార్డులను మరింత కచ్చితత్వంతో నవీకరించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ సందర్భంగా జడ్చర్ల తహశీల్దార్ నర్సింగ్‌రావుతో కలిసి గ్రామ శివారులో కొలతల ప్రక్రియను పరిశీలించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, లైసెన్స్డ్ సర్వేయర్ల సమక్షంలో జరుగుతున్న సర్వే పనులను ఆమె స్వయంగా తనిఖీ చేశారు. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సర్వే నిర్వహిస్తున్న తీరును, భౌతిక కొలతలు, సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియను సమీక్షించారు. సర్వే పనుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో నిర్వహించాలని సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి సర్వే ప్రక్రియపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామ సరిహద్దుల నిర్ధారణలో ఎదురవుతున్న సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకుని, శాస్త్రీయ పద్ధతిలో చేపడుతున్న రీ-సర్వే ద్వారా భూముల సరిహద్దులపై స్పష్టత ఏర్పడటంతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గుతాయని, ప్రభుత్వ భూ రికార్డులు మరింత విశ్వసనీయంగా మారుతాయని వివరించారు. సర్వే బృందాలు అన్ని రకాల భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన భూ వివరాలను సేకరించాలని, సర్వే విధానంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, వారి సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని ఆదేశించారు.
ఈ ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం పాటిస్తూ ప్రజల భాగస్వామ్యంతో సర్వే పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు రైతులు, గ్రామ ప్రజలు రెవెన్యూ, సర్వే శాఖ అధికారులకు పూర్తి సహకారం అందించాలని అదనపు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

