కలం, నిజామాబాద్ బ్యూరో : ఇందూరు రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధి కోసం పాటుపడతానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) తెలిపారు. నిజామాబాద్‌లోని 34, 39వ డివిజన్లలో బుధవారం రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో కేంద్ర నిధులతో అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
కార్పొరేషన్ లో ఇటీవల కేటాయించిన 20 లక్షల నిధులతో పాలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ కేటాయించాలని, దీంతో మరిన్ని పనులు ముందుకు సాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, నాయకులు సాయిరాం, పవన్ ముందడ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
మిర్చి కంపౌండ్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్‌లోని మిర్చి కంపౌండ్‌లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన చేస్తుండగా పరిశీలించారు. అయితే మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా నాణ్యత ఉండాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

