కలం, హనుమకొండ : మహిళల సాధికారత, పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (MP Kadiyam Kavya) అన్నారు. బుధవారం హనుమకొండలోని (Hanamkonda) కాళోజీ కళాక్షేత్రంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 2,698 మంది లబ్ధిదారులకు మంజూరైన చేయూత పింఛన్ల పత్రాలను (Cheyutha Pension Sanction Letters) ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయి, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, అర్హులైన అన్ని వర్గాలకు పింఛన్లు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం అర్హులను గుర్తించి ఒకే రోజు 2,698 మందికి పింఛన్లు మంజూరు చేయడం ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మిగిలిన అర్హులకు విడతలవారీగా అందిస్తామని తెలిపారు. పెన్షన్ల మంజూరులో రాజకీయ వివక్ష ఉండదని, లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అర్హత ఉండి పింఛన్ రానివారు ఆందోళన చెందవద్దని, వారి సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయి మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీతో లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని, పింఛన్ల మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. దాదాపు పదేళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులకు పింఛన్లు అందించడం అభినందనీయమని, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అజీజ్ ఖాన్, ఏనుమాముల మార్కెట్ చైర్మన్ పులి ప్రియాంక, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

