యువత రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి: ఎంపీ నగేష్​

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు యువజన ఉత్సవాలు (Youth Festival) ఎంతగానో దోహదపడతాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎంపీ గోడం నగేష్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ఎంపీ గోడం నగేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, జిల్లా కలెక్టర్ రాజర్షి షా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. యువత పోటీతత్వాన్ని అలవర్చుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, నృత్యాలకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉందని, పురాతన దేవాలయాల్లోని శిల్పకళలోనూ మన పూర్వీకుల కళా వైభవం, నృత్యరీతులు ప్రతిబింబిస్తాయని వివరించారు. గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.

పోటీల్లో పాల్గొనేటప్పుడు అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని తమలోని ప్రతిభను సంపూర్ణంగా ప్రదర్శించాలని సూచించారు. 1998లో ఆదిలాబాద్‌లో జాతీయ స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుత ఉత్సవాల్లో పాల్గొంటున్న యువతీయువకులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిల వరకు విజేతలుగా నిలిచి అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ స్టెప్ సతీష్, పోటీల న్యాయ నిర్ణేతలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, యువతీయువకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>