ఏళ్ల నిరీక్షణకు తెర.. ఉమ్మడి కరీంనగర్‌లో 34 కొత్త PACSలు!

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో సహకార రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (Primary Agricultural Cooperative Societies)  ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. తద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అదనంగా 34 సహకార సంఘాలు (34 New PACS) పెరగనుండగా రైతాంగానికి వ్యవసాయ రుణాలు, ఎరువులు ఇతర సహకార సేవలు మరింత వేగంగా, సులభంగా అందనున్నాయి.  కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ KDCCB పరిధిలో ప్రస్తుతం కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలలోని కొంత భాగం కొనసాగుతోంది.

ఇప్పటివరకు ఈ పరిధిలో మొత్తం 135 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు PACS సేవలు అందిస్తున్నాయి. అందులో KDCCB పరిధిలో 132 ఉండగా మూడు సొసైటీలు మాత్రం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా పరిధిలో ఉనాయి. బి కెటగిరీలో 250 నేత, చేనేత సంఘాలు, మరో 150 లేబర్, ఎంప్లాయిమెంట్, కళాకారుల సహకార సంఘాలున్నాయి. ఏడాది క్రితం 40 కొత్త PACSల ఏర్పాటుకు KDCCB ప్రతిపాదనలు చేశారు. రైతుల సంఖ్య పెరుగుదల, గ్రామీణ ప్రాంతాల విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తాజాగా మరో 34 కొత్త PACS లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ లెక్కన KDCCB పరిధిలో 169 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి.

జిల్లాల వారీగా ప్రయోజనాలు

కరీంనగర్ జిల్లా: ఇప్పటికే ఉన్న సొసైటీలతో పాటు 7 కొత్త ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. అందులో వెదిర, గర్షకుర్తి, ఆకునూరు, ఇందుర్తి, చల్లూరు, ఎలగందుల, గన్నేరువరం ప్రాంతాలలో నూతన సంఘాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా: 5 కొత్త PACSలు మంజూరు చేశారు. అందులో గజసింగారం, పెద్దలింగాపూర్, చెక్కపల్లి, రుద్రంగి, వీర్నపల్లి ప్రాంతాల్లో కొత్త PACS ల ఏర్పాటుతో స్థానిక రైతులకు మరింత ఊత లభించనుంది.
పెద్దపల్లి జిల్లా: జిల్లాలో 6 కొత్త PACSలకు అనుమతి లభించింది. అందులో దొంగతుర్తి, గుంజపడుగు, కొలనూరు, తుర్కల మద్దికుంట, అంతర్గాం, రత్నాపూర్( రామగిరి ) ప్రాంతాల్లో కొత్త సంఘాలు మంజూరు చేశారు.
జగిత్యాల : జిల్లాలో 12 కొత్త PACSలకు అనుమతి మంజూరు లభించింది. అందులో డబ్బు తిమ్మాయిపల్లి, పొలాస, తట్లవాయి. పాతగూడూరు, మద్దులపల్లి, మల్లన్నపేట, న్యూధర్మజ్ పల్లి, జగ్గసాగర్, మన్నెగూడెం, కథలాపూర్, బుగ్గారం, నేరెళ్ల లో కొత్త సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. ఇతర జిల్లాలలో కలిసిపోయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా KDCCB పరిధిలోని జయశంకర్ భూపాలపల్లిలో అదనంగా మూడు కొత్త PACSలుగా బోర్లగూడెం, కొయ్యూరు, పలిమెల సంఘాలు ఏర్పాటు కానున్నాయి. హన్మకొండ పరిధిలో అదనంగా కొత్త సంఘాలేవీ ఏర్పాటు కాలేదు. సిద్దిపేట జిల్లాల పరిధిలో ఒక్క అక్కన్నపేట కొత్త సంఘాన్ని ఏర్పాటవుతుండటంతో సహకార రంగానికి మహర్దశ పట్టనుంది.

రైతుల్లో హర్షాతిరేకాలు

కొత్తగా PACS ఏర్పాటవుతుండటంతో ప్రతీ గ్రామీణ ప్రాంత రైతుకు సహకార బ్యాంకుల సేవలు ప్రత్యక్షంగా అందనున్నాయి. ఎన్నికలు, అధికారిక లాంఛనాలు పూర్తి చేసుకుని ఈ కొత్త సంఘాలు అందుబాటులోకి వస్తే ధాన్యం కొనుగోళ్లు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు సులభతరమై వ్యవసాయ రంగానికి మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>