విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్య, మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. బుధవారం కల్లూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Kalluru Govt School) లో PSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ యూనిట్‌ను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. PSR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో పాఠశాలలో రూ.2 లక్షల వ్యయంతో ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో ఇదే ట్రస్ట్ ద్వారా పాఠశాల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. విద్యతో పాటు క్రీడా రంగాల్లోనూ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు సైతం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తూ, ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో రూ.25 కోట్ల వ్యయంతో టాటా సంస్థ భాగస్వామ్యంతో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు PSR చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటు చేసినందుకు మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. కల్లూరు పాఠశాల విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ నిధులతో పాటు ట్రస్టు సహకారాన్ని కూడా వినియోగించు కుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>