కలం, నేషనల్ డెస్క్ : బర్డ్ ఫ్లూ (Bird Flu) ముప్పును ఎదుర్కొనే దిశగా భారత్ (India) కీలక ముందడుగు వేసింది. కోళ్లతో పాటు ఇతర పక్షులకు ప్రాణాంతకంగా మారుతున్న H5N1 వైరస్‌ను నియంత్రించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సిన్ (H5N1 Vaccine) అందుబాటులోకి రానుంది. ఈ టీకాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) నవంబర్ 20న భోపాల్‌లో దేశానికి అంకితం చేయనున్నారు. దీంతో పౌల్ట్రీ రంగానికి ఊరట లభించడమే కాకుండా, ప్రజారోగ్య పరిరక్షణకు కూడా కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. భోపాల్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) పరిధిలో పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. H5N1 వైరస్‌లోని క్లేడ్ 2.3.2.1a రకాన్ని ఎదుర్కొనే లక్ష్యంతో దీనిని అభివృద్ధి చేశారు.
బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ ఏటా భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. వైరస్ సోకిన పక్షుల మరణాలు, వ్యాధి వ్యాప్తిని నియంత్రించడం పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టీకా అందుబాటులోకి రావడం ద్వారా పక్షుల్లో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు, పౌల్ట్రీ రంగానికి కలిగే నష్టాలను నియంత్రించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. అలాగే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌ల ముప్పును ఎదుర్కొనే ప్రజారోగ్య సంసిద్ధతకు కూడా ఇది కీలక ముందడుగుగా నిలవనుంది.

