రిటైర్డ్ డీజీ భూమికే ఎసరు.. భూ భారతి పోర్టల్‌లో భారీ ట్యాంపరింగ్!

క‌లం, మెదక్ బ్యూరో: హైదరాబాద్ శివార్లలో విలువైన భూములే లక్ష్యంగా అక్రమార్కులు కొత్త తరహా‌ మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల భూములనే కాకుండా, ఏకంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ భూమికే ఎసరు పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూ భారతి పోర్టల్ ట్యాంపరింగ్ ద్వారా భూ బదలాయింపు చేయడంపై (Sangareddy Land Scam) ఆందోళన కలిగిస్తున్నది.

అసలేం జరిగింది?

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేట రెవెన్యూ గ్రామంలో ఓ రిటైర్డ్ డీజీ 4. 27 ఎకరాల భూమిని 2007లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ. 20 కోట్ల వరకు ధర ఉంటుంది. ఆ భూమిపై కన్నేసిన అక్రమార్కులు, రిటైర్డ్ డీజీకి తెలియ‌కుండానే మ్యుటేషన్ కు హైదరాబాద్ లో స్థిరపడిన జోగిపేట‌కు చెందిన మీర్ మురద్ ఆలీ వ్యక్తి పేరుపైకి చేసేశారు. పూర్తిగా డిజిటల్ ట్యాంపరింగ్ ద్వారానే భూమిని ఒక‌రి పేరు నుంచి మరొకరి పేరు మీద‌కు బ‌దాలాయింపులు చేశారు.

రహస్యంగా సీఐడీ విచారణ

కొన్నాళ్ల కింద తన భూమి ఇతరుల పేరుపైకి మారినది గుర్తించిన రిటైర్డ్ డీజీ అవాక్కయ్యారు. ఈ వ్యవహారంపై తన పలుకుబడిని ఉపయోగించి ఉన్నతస్థాయిలో విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఉన్నతస్థాయి పోలీసు ఆఫీసర్ భూమినే కాజేయడంతో (Sangareddy Land Scam) డిపార్ట్‌మెంట్ పరువుకు సంబంధించినదిగా తీసుకుని పోలీసు ఉన్నతాధికారులు సీఐడీతో రహస్యంగా విచారణ చేయిస్తున్నారు. భూ బదలాయింపు జ‌రిగిన తీరుపై సంగారెడ్డి జిల్లా ఉన్న‌తాధికారులను కూడా హైదరాబాద్‌కు పిలిపించి వివ‌రాలను సేక‌రించారు.

పాత నిందితుల హస్తం?

అయితే.. గత జులైలో రామచంద్రాపురం పీఎస్ లో తహసీల్దార్ ఫిర్యాదుతో అక్ర‌మ మ్యుటేషన్ పై కేసు నమోదైంది. కొల్లూరులోని సుమారు రూ.100 కోట్ల విలువైన మూడెకరాల భూమిని బి.వినోద్ కుమార్ పేరిట అక్రమంగా మ్యుటేషన్ చేసినట్లు, గత జూన్ 27కు ముందు తమ ఆఫీసు భూ భారతి మ్యుటేషన్ మాడ్యూల్స్ లేదా వర్క్‌ఫ్లోలో దరఖాస్తు ఎక్కడా కనిపించలేదని తహసీల్దార్ ఫిర్యాదులో వివరించారు. వినోద్ కుమార్ ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని, అలాగే ఆఫీసు తరఫున ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ, మ్యుటేషన్ ప్రతిపాదన, సిఫార్సు లేదా ఆమోదం చేయలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రెవెన్యూ అధికారుల‌కు తెలియ‌కుండా మ్యుటేషన్, అక్రమ ఎంట్రీని గుర్తించి భూ భారతి పోర్టల్ హ్యాక్‌కు గురై ఉండొచ్చని, రెవెన్యూ రికార్డులను మార్పు చేయొచ్చని అనుమానించారు. ధరణి, భూ భారతి పోర్టల్ లోని సమస్యలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత జులైలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల విచారణలో భాగంగా కొల్లూరులోని భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేసిన కేసులో సీఐడీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. భూ భారతి ఆపరేటర్‌తో పాటు శివ, రాజేందర్, పవన్, మహేష్‌ను సీఐడీ అరెస్ట్ చేసి సంగారెడ్డి జిల్లా కంది జైలుకు పంపింది. రిటైర్డ్ డీజీకి చెందిన భూమి క్యులేషన్‌లోనూ వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానించారు.

పోలీసుల అదుపులో 15 మంది

అదేవిధంగా కొల్లూరు, సిద్దిపేట, రామచంద్రాపురం, పటాన్‌చెరు ప్రాంతాల్లో ధరణి, భూ భారతి పోర్టల్ దుర్వినియోగం చేసిన కేసుల్లో ప్రమేయం కలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారులే స్కామ్‌లో ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. కంది జైలులోని నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని సీఐడీ లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 15 మందిని అదుపులోకి తీసుకుని, అక్రమ మ్యుటేషన్ లో జిల్లా స్థాయి రెవెన్యూ ఉన్నతాధికారుల పాత్రపైనా ఆరా తీస్తూ విచారిస్తున్నట్టు తెలుస్తుంది.

రికార్డుల నుంచి తొలగింపు?

మరోవైపు వివాదం ముదరడంతో రిటైర్డ్ డీజీ భూమిని మీర్ మురద్ అలీ పేరు చేసిన అక్రమ మ్యుటేషన్ కు రికార్డుల నుంచి తొలగించినట్లు సమాచారం. రిటైర్డ్ డీజీ భూమిని తిరిగి ఆయన పేరుమీద‌కే రహస్యంగా మార్చిన‌ట్టు తెలుస్తుంది. అయితే కేసుకు సంబంధించి ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది, అదుపులోకి తీసుకున్నవారిని ఎక్కడ ఉంచి విచారిస్తున్నారనే పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. డిజిటల్ భూ స్కామ్ వ్యవహారం సంగారెడ్డి జిల్లా రెవెన్యూ, పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. భూభార‌తి, ధ‌ర‌ణిలోని సాంకేతిక లోపాల‌ను ఆస‌రాగా చేసుకొని సైబ‌ర్ త‌ర‌హలో భూ రికార్డుల మార్పిడి చేయ‌డం సామాన్యులను కూడా ఆందోళనకు గురిచేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>