ప్రజాస్వామ్యానికి ఊపిరి జర్నలిజమే..”కలాల”కు ఘన సత్కారం!

కలం, ఖమ్మం బ్యూరో: దేశంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసేది, దానిని కాపాడేది జర్నలిజమేనని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) నేతలు (Khammam Journalists) స్పష్టం చేశారు. సమాజంలో నిజాన్ని అన్వేషిస్తూ, దానిని వెలుగులోకి తెస్తూ ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నది పాత్రికేయులేనని కొనియాడారు. జాతీయ జర్నలిజం దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మంలోని ఎన్నెస్పీ రామాలయం ఫంక్షన్ హాల్‌లో డబ్ల్యూజేఐ జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జర్నలిజం రంగంలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించిన సీనియర్ పాత్రికేయులు ఎన్.ఎస్.రావు, కట్టెకోల చిన నరసయ్య, యెన్నెబోయిన శ్రీనివాస రావు, జాబిశెట్టి కుటుంబ రావు, ఎం.ఏ అన్సార్ పాషా, సెఫీ యు జమ, గోగుల నారాయణ రావు, గంటెల ఆనంద్, ఏనిగండ్ల శ్రీనివాస రావులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి తేనేటి విందులో పాల్గొన్నారు.

​కార్యక్రమంలో యూనియన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్.ఎస్.రావు) మాట్లాడుతూ.. జర్నలిస్టులు నిజాయితీ, సమగ్రత, తటస్థత, చట్టబద్ధత, ప్రజలకు జవాబుదారీతనం వంటి విలువలతో పనిచేయాలని సూచించారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు, పెన్షన్లు అమలు చేయాలని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జిల్లా కో-కన్వీనర్ యెన్నెబోయిన శ్రీనివాస రావు మాట్లాడుతూ.. నేడు జర్నలిజం కత్తి మీద సాములా మారిందని, దాడులు, అక్రమ కేసుల నుంచి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని కోరుతూ, హక్కుల సాధనకు జర్నలిస్టులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మరో కో-కన్వీనర్ ఎం.ఏ అన్సార్ పాషా మాట్లాడుతూ.. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం జర్నలిస్టులకు అప్పుడప్పుడూ ఆటాపాట వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలతో పాటు నాయకులు బొడ్డుపల్లి రవీందర్, పసుపులేటి ఉపేందర్, శ్రీనివాస చారి, వుల్లోజీ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>