కలం, వేములవాడ: అభివృద్ధి పేరుతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (Vemulawada Temple) ప్రతిష్ఠను, కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం తగదని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి హెచ్చరించారు. మంగళవారం వేములవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పనులు ప్రారంభించే సమయంలో గర్భగుడిని కనీసం తాకబోమని స్పష్టమైన హామీ ఇచ్చిన పాలకులు, నేడు ఏకంగా గర్భగుడి శిఖరాన్ని (గోపురం) తొలగించే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేసి, అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు.
అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల స్లాబ్ ఎత్తు పెరిగి, దూరం నుంచి భక్తులకు గోపురం కనిపించని పరిస్థితి ఏర్పడిందని గోపి ఆరోపించారు. ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు శృంగేరి పీఠాధిపతి అనుమతి తీసుకున్నామని చెబుతూ, పీఠాధిపతిని సైతం బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భగుడి గోపురాన్ని తొలగించి కొత్తది నిర్మించేందుకు శృంగేరి పీఠం ఇచ్చిన అనుమతి పత్రాలను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తాము కూడా శృంగేరికి వెళ్లి పీఠాధిపతిని కలిసి వాస్తవాలను వివరిస్తామని స్పష్టం చేశారు.
ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు వచ్చిన నిధులు, చేసిన ఖర్చులు, పనుల పూర్తి గడువుపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని గోపి డిమాండ్ చేశారు. ఆలయంలోని దక్షిణామూర్తి విగ్రహం, వేయి స్తంభాల మండపం ఏ స్థితిలో ఉన్నాయో భక్తులకు తెలియజేయాలని కోరారు. వీటీడీఏ (VTDA) వైస్ చైర్మన్, జిల్లా కలెక్టర్ స్పందించి రేపటి నుంచే విలేకరులను, అఖిలపక్ష నాయకులను ఆలయంలోకి అనుమతించి పనులను చూపించాలని విజ్ఞప్తి చేశారు. రాజరాజేశ్వర స్వామి ఆలయం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సొంత జాగీరు కాదని, ఇది పేదల పెన్నిధి అని పేర్కొన్నారు. ఆలయంలోకి అనుమతించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని రెడ్డబోయిన గోపి తేల్చిచెప్పారు.

