నిరుపేదల గుమ్మానికే పథకాలు.. వేంసూరులో పింఛన్ల పంపిణీ!

కలం, ఖమ్మం బ్యూరో: “అర్హతలే గీత.. సిఫార్సులకు తావులేదు” అన్న నినాదంతో అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. మంగళవారం వేంసూరు (Vemsoor) మండల కేంద్రంలో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కష్టాలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వేంసూరు మండలంలో కొత్తగా 686 మందికి చేయూత పింఛన్లు మంజూరు చేయగా, కేవలం ఈ మండలంలోనే ప్రతినెలా రూ. 1 కోటి 48 లక్షలు పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రుణమాఫీ, రైతు భరోసాతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

​ఎంపీ రఘురాం రెడ్డి, కలెక్టర్ దివాకర టి.ఎస్ మాట్లాడుతూ.. ఎలాంటి పరిమితులు, సిఫార్సులు లేకుండా పూర్తిగా అర్హత ఆధారంగానే పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వికలాంగులకు రూ. 4,016, మిగతా వారికి రూ. 2,016 చొప్పున పింఛను లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ మొదటి విడతలో వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులకు పింఛన్లు ఇచ్చామని, మిగిలిన అర్హులకూ త్వరలోనే వృద్ధాప్య పింఛన్లు అందుతాయని భరోసానిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>