ఇల్లందులో గంజాయి కలకలం.. ముగ్గురు యువకులకు పాజిటివ్!

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (Yellandu) పట్టణంలో గంజాయి వినియోగం కలకలం రేపింది. గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వైద్య పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోర్టు ఆదేశాల మేరకు వీరిని భద్రాచలంలోని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించారు.

​జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా మత్తు పదార్థాల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇల్లందు డీఎస్పీ యు. వెంకన్నబాబు మార్గనిర్దేశంలో ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా, ముగ్గురూ గంజాయి సేవించినట్లు నివేదికల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా నిందితులను ఇల్లందు మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం భద్రాచలంలోని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించారు.

​ఈ సందర్భంగా ఇల్లందు సీఐ సురేష్ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల వ్యక్తుల ఆరోగ్యం, భవిష్యత్తు, కుటుంబ జీవితం పూర్తిగా నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజ భద్రతకు కూడా పెను ముప్పుగా పరిణమిస్తుందని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు.

గంజాయి విక్రయించినా, సేవించినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఇప్పటికే మత్తు పదార్థాలకు బానిసైన వారు స్వచ్ఛందంగా డీ-అడిక్షన్ కేంద్రాల సేవలను వినియోగించుకుని సాధారణ జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు ఉమ, పి.ఎస్. పాణి, సిబ్బంది లాల్ సింగ్, రవి, బాలు ప్రవీణ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>