బీమా పథకం అమలులో నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని (Indiramma Family Insurance) జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక శిబిరాలు ప్రారంభమయ్యేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. మంగళవారం వెబ్‌ఎక్స్‌ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పథకం అమలు సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షించారు.

రేషన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించి, ప్రతి అర్హ కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ నెల 18న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రేషన్ డీలర్లతో మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించి శిబిరాల నిర్వహణపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో మూడు, నాలుగు వార్డులకు కలిపి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. శిబిరాల వద్ద టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు, ఫ్లెక్సీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు ప్రక్రియలో మహిళా స్వయం సహాయక సంఘాల సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, వార్డు అధికారులు, రేషన్ డీలర్లు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కుటుంబాన్ని పోషించే ప్రధాన సంపాదనపరుడైన 18 నుంచి 59 ఏళ్లలోపు వ్యక్తులు ఈ పథకానికి అర్హులని కలెక్టర్ తెలిపారు. కుటుంబ యజమాని ఆకస్మికంగా మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం బీమా సంస్థల సహకారంతో రూ.5 లక్షల జీవిత బీమా అందిస్తుందని వివరించారు.

దరఖాస్తులో కుటుంబ సభ్యుల్లో ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనే అవకాశం ఉన్నందున, వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. రేషన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారుల వివరాలతో ముందస్తుగా నింపిన దరఖాస్తులను రేషన్ షాపుల వారీగా సిద్ధం చేసి సంబంధిత అధికారులకు అందించాలని సూచించారు. రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ఆధార్ ఆధారంగా ధ్రువీకరణ చేసుకుని దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, అటువంటి వారు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>