లక్ష మంది రైతులతో హైదరాబాద్‌ను ముట్టడిస్తాం : AIKS

కలం, నల్లగొండ : కార్పొరేట్ అనుకూల విధానాలతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని అఖిల భారత కిసాన్ సభ ( AIKS) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ (Viju Krishnan) మండిపడ్డారు. నల్లగొండలో జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజూ కృష్ణన్ మాట్లాడుతూ.. రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై దేశవ్యాప్తంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని విజూ కృష్ణన్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆహార భద్రతకు వెన్నెముక అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)ను ప్రైవేటీకరించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఆహార నిల్వల వ్యవస్థపై కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెరుగుతోందని, మరోవైపు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలను కార్పొరేట్ కంపెనీలే నియంత్రిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ వాణిజ్య ఒప్పందాలతో దేశీయ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

గతంలో తాము చేపట్టిన అలుపెరగని పోరాటాల వల్లే మహారాష్ట్రలో రూ. 32 వేల కోట్ల రుణమాఫీని సాధించగలిగామని విజూ కృష్ణన్ గుర్తు చేశారు. అలాగే తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ రైతు ఉద్యమాలతో అనేక విజయాలు సాధించామని తెలిపారు. ప్రస్తుతం 27 రాష్ట్రాల్లో విస్తరించిన అఖిల భారత కిసాన్ సభకు దేశవ్యాప్తంగా కోటి 58 లక్షల సభ్యత్వం ఉందని ఆయన వెల్లడించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కనీస మద్దతు ధర ప్రకటించడంతో పాటు, దానికి చట్టబద్ధమైన హామీ కల్పించాలన్నారు.

రాష్ట్రంలో కౌలు రైతులు, భూమిలేని పేద రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, కరువు పరిస్థితుల్లో నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి లక్ష మంది రైతులతో హైదరాబాద్‌కు భారీ లాంగ్‌మార్చ్ చేపట్టే ఆలోచన ఉందని ప్రకటించారు. రైతు, కార్మిక, ఇతర ప్రజాసంఘాలను ఏకం చేసి దేశవ్యాప్తంగా విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. చివరగా, నల్లగొండలో 36వ జాతీయ మహాసభల విజయవంతమైన నిర్వహణకు సహకరించిన మీడియా ప్రతినిధులకు విజూ కృష్ణన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

డిసెంబర్, జనవరిలో దేశవ్యాప్తంగా గోదాముల ముట్టడి..

దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేయనున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) ప్రకటించింది. నిత్యావసర ధరల పెరుగుదల, ఉపాధి హామీ అమలులో నిర్లక్ష్యం, ప్రజా పంపిణీ వ్యవస్థలో కోతలను నిరసిస్తూ డిసెంబర్, జనవరి నెలల్లో దేశవ్యాప్తంగా గోదాముల ముట్టడి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంఘం నేతలు వెల్లడించారు. మంగళవారం నల్లగొండలోని జీఎం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయరాఘవన్, ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ మాట్లాడారు.

ఆహార ధాన్యాల ధరలు రెండంకెల స్థాయిలో పెరగడం సామాన్యుల జీవనాన్ని భారంగా మార్చిందని విజయరాఘవన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ వంటి రాష్ట్రాల్లో సైతం బియ్యం ధరలు పెరిగి పేద కుటుంబాలపై అదనపు భారం పడుతోందన్నారు. ఉపాధి హామీ పథకంలో పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతామన్న హామీ అమలుకు నోచుకోలేదని, గ్రామీణ కూలీలకు పని, వేతనం, ఉపాధి భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం కోటాను 35 కిలోల నుంచి 25 కిలోలకు తగ్గించడం ఆందోళనకరమన్నారు.

గిడ్డంగులను ప్రైవేటుకు అప్పగించడం వల్ల రైతులకు నిల్వ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దేశంలో 36 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నప్పటికీ, నిత్యావసర ధరలు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ ఆరోపించారు. అలాగే 40 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నా భూమిలేని పేదలకు పంపిణీ చేయకుండా, ‘భూ బ్యాంకుల’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ వల్ల వ్యవసాయ కార్మికులు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, వలస కార్మికులు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, దీనిపై విస్తృత ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>