కలం, జోగులాంబ గద్వాల: జిల్లాలో (Jogulamba Gadwal) ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక శిబిరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఇతర అధికారులతో పథకం అమలు సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ వెబ్ ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని (Indiramma Family Life Insurance) ప్రవేశపెడుతున్నందున జిల్లావ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు ప్రారంభం కానున్నందున అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. రేషన్ కార్డుదారుల డేటాను ప్రతి మండలానికి పంపించడం జరుగుతుందని దీని ఆధారంగా ఆయా రేషన్ దుకాణాల పరిధిలోని లబ్ధిదారులందరి చేత బీమా పథకానికి దరఖాస్తు చేయించేలా ప్రణాళికతో అధికారులు ముందుకెళ్లాలన్నారు.
మండలాల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించాలి..
పథకం పకడ్బందీ అమలుకు ఈనెల 18న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, రేషన్ డీలర్లు, తదితరులతో ఆయా మండలాల ఉన్నతాధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించి తగు సూచనలు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని, ఇందుకోసం అనువైన ప్రదేశాన్ని గుర్తించి అవసరమైన టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు, ఫ్లెక్సీలు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని మూడు, నాలుగు వార్డులు కలిపి ఒకచోట శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి..
రేషన్ కార్డ్ దారుల దరఖాస్తులను పూరించడం, ఇతర విధుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకోవచ్చని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, వార్డు అధికారులు, రేషన్ షాపు డీలర్లు సమన్వయంతో పనిచేస్తూ అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ రేషన్ షాపులకు కలిపి ఒకే చోట శిబిరం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పథకం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగేలా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని ఆదేశించారు.
కుటుంబ యజమాని పేరిట బీమా దరఖాస్తు..
కుటుంబాన్ని పోషించే యజమాని పేరిట బీమా దరఖాస్తు చేసుకునేందుకు 18-59 ఏళ్లలోపు వారందరూ ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఫలితంగా సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందిన సందర్భంలో ఆయా కుటుంబాలు ఇబ్బంది పడకుండా భీమా కంపెనీల సహకారంతో ప్రభుత్వం రూ.5 లక్షలను ఇస్తుండడంతో ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. దరఖాస్తుదారుడు తమ నామినీలుగా కుటుంబ సభ్యుల్లోని ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా సూచించేందుకు అవకాశం కల్పించినందున అందుకు అనుగుణంగా ముందుకెళ్లడం జరుగుతుందన్నారు.
దరఖాస్తులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు..
రేషన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారుల వివరాలతో ముందస్తుగా నింపిన దరఖాస్తులను రేషన్ షాపుల వారీగా సిద్ధం చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, అటువంటి వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. లబ్ధిదారుల పూర్తి వివరాలతో, సంతకంతో పూరించిన దరఖాస్తులను పోగొట్టడం, ఎక్కడపడితే అక్కడ పడేయడం వంటి దుర్వినియోగానికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పూరించిన దరఖాస్తులను రోజువారీగా జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు.
సులభతరం చేసేందుకు ప్రత్యేక యాప్..
దరఖాస్తుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేక యాప్, ఆన్లైన్ నమోదు సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లోని ఆపరేటర్లకు ఆన్లైన్ నమోదు విధానంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కంప్యూటర్, ప్రింటర్ సదుపాయాలు అందుబాటులో ఉన్న శిబిరాల్లో దరఖాస్తుల ఆన్లైన్ నమోదు, ప్రింటింగ్, లబ్ధిదారుల సంతకాల ప్రక్రియను అక్కడికక్కడే ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో రోజువారీ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎక్సెల్ ట్రాకింగ్ షీట్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మొత్తం రేషన్ కార్డుదారుల సంఖ్య, అందిన దరఖాస్తులు, ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, పెండింగ్‌కు గల కారణాలు, ఆధార్ ఆధారిత దరఖాస్తుల వివరాలను ప్రతిరోజూ నమోదు చేయాలన్నారు.
నిరంతరం పర్యవేక్షించాలి..
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని శిబిరాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేస్తుండాలని ఆదేశించారు. రోజువారీ నివేదికలను జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని తెలిపారు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, పౌరసరఫరాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఈ నెల 19వ తేదీ నాటికి అన్ని శిబిరాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

