కలం, నల్లగొండ: నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న గండికోట జగదీష్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య(Student suicide)కు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన జగదీష్.. నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగదీష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికి అందివచ్చిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తోటి విద్యార్థి మృతితో కళాశాల ప్రాంగణం, హాస్టల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

