కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (Khelo India Youth Games) జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సంబంధించి క్రీడాకారుల వసతి ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushbu Gupta)తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బోయపల్లి సమీపంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల-1ను సందర్శించి క్రీడాకారుల బస కోసం ఏర్పాటు చేస్తున్న వసతి గదులు, డార్మిటరీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
డిసెంబర్ 11 నుండి 22 వరకు నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్రీడాకారులకు నాణ్యమైన వసతి, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జితేందర్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి మధుసూదన్ నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, జిల్లా రెవెన్యూ అధికారి ఎ.నిర్మలా, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఛత్రు నాయక్, జిల్లా క్రీడల అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

