కలం, కరీంనగర్: అలుగునూరులో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ (Deeksha Diwas) సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని, జన సమీకరణ నుంచి సభా నిర్వహణ వరకు ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంటలో గల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన దీక్షా దివస్ నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
నేటి నుంచే ప్రచార హోరు..
సభ జరిగే రోజు వరకు ప్రతిరోజూ ప్రజల్లోకి వెళ్లేలా ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని నాయకులకు సూచించారు. దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు బొట్టు కార్యక్రమం, డప్పు కొట్టే కార్యక్రమం, వాల్ రైటింగ్, కరపత్రాల పంపిణీ వంటి ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు దీక్షా దివస్ కార్యక్రమం గురించి వివరించేలా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు.
పలువురు ముఖ్య నాయకుల హాజరు
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితల సతీష్ కుమార్, రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, చల్మెడ లక్ష్మీనరసింహారావు, జిల్లా అధ్యక్షులు జి.వి. రామకృష్ణారావు, తోట ఆగయ్య, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు తుల ఉమ, దావ వసంత, న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రఘువీర్ సింగ్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

