కలం, కరీంనగర్ బ్యూరో: ‘‘సార్.. నేను సర్పంచ్ గా ఉన్న టైంలో పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేస్తూ నక్సల్స్ సమాచారం ఇచ్చేవాడిని. ఇది గమనించి నక్సల్స్ నన్ను పట్టుకుని చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. నాపై కాల్పులు జరిపారు. నా నడుము విరిగింది. నడుము నుండి కింద కాళ్ల వరకు స్పర్శ కోల్పోయి నరక యాతన అనుభవిస్తున్నా. గత 33 ఏళ్లుగా చావలేక బతుకుతున్నా.’’అంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వద్ద గోడు వెళ్లబోసుకున్నాడు.
మంగళవారం ఉదయం భార్యను వెంట పెట్టుకుని ఆటోలో కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి ఆటో నుండి దిగలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన కేంద్ర మంత్రి స్వయంగా ఆఫీస్ నుండి తానే బయటకు వచ్చి ఆటోలోనున్న శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. 33 ఏళ్ల క్రితం నక్సల్స్ జరిపిన కాల్పులు, పెట్టిన చిత్ర హింసల వల్ల పూర్తిగా వికలాంగుడినై మంచానికే పరిమితమయ్యానని వాపోయారు. ఆనాడు నక్సల్స్ జరిపిన కాల్పుల మూలంగా ఇప్పటికీ బుల్లెట్ తనలోనే ఉందని, మల మూత్రాలు కూడా విసర్జించలేని దుస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాంతం మందులతోనే గడపాలని డాక్టర్లు తేల్చారని, అయితే తన కుంటుబ పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎంఎస్సీ, బీఈడీ చేసిన తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగమిప్పించడంతోపాటు తాను బతికింత కాలం మందులు ఇప్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

