కలం, వరంగల్ బ్యూరో: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ (Enumamula Market)లో అధికారులు, వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదం కాస్త ముదురుతున్నది. అమ్మకాల్లో అక్రమాల గుర్తింపుతో మొదలైన వివాదం నడుమ రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయి. మార్కెట్లో రూల్స్ అమలు కావాలా? లేక వ్యాపారుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గాలా? అనే విస్తృత చర్చకు దారితీస్తున్నది. కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించినా బంద్ కొనసాగించడంపై హాట్ టాపిక్‌గా మారింది.
తనిఖీలతో మొదలై.. నోటీసులతో ముదిరి
ఈనెల 4, 5 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన లక్ష్మణుడి బృందం వరంగల్ ఏనుమాముల మార్కెట్లో క్రయ విక్రయాల తీరును పరిశీలించింది. తూకాల్లో వ్యత్యాసాలు, హమాలీ చార్జీల వసూళ్లు, ఈ నామ్ నమోదు, వేబ్రిడ్జి వినియోగం వంటి అంశాల్లో విస్తృతంగా తనిఖీలు చేసింది. గన్నీ బ్యాగుల చార్జీల వసూలు, హమాలీ పని చేయకుండానే అదనపు వసూళ్లు, మిర్చి బస్తాల బరువులో కటింగ్, మార్కెట్‌కు రాని సరుకుకు తక్కపట్టీలు జారీ వంటివి క్షణ్ణంగా పరిశీ లించింది.
ఈ తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలపై వివరణ కోరుతూ ఈనెల 10న పలువురు వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అవే వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. వాటిపై వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులతో విభేదాలు పెరిగిపోయాయి.
కొనుగోళ్ల బంద్‌తో ఒత్తిడి
వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదును నిరసిస్తూ వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతుగా నిలిచింది. కొనుగోళ్లు నిలిపివేతతో మార్కెట్లో పత్తి క్రయవిక్రయాలు స్తంభించాయి. మార్కెట్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. నోటీసుల పై అభ్యంతరాలుంటే అధికారులతో చర్చించడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, కానీ కొనుగోళ్లు బంద్ పెట్టడ డం ద్వారా, పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇరువర్గాల వివాదంలో రైతుల ప్రమేయం లేకపోయినా, పత్తిని మార్కెట్‌కు తీసుకురాగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆరేళ్ల కింద చర్చలతో పరిష్కారం
ఆరేళ్ల కింద ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వ్యాపారులు ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఇప్పుడు కూడా అదే అనుసరించి ఉంటే పరిస్థితి పెరిగేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసుల్లోని అంశాలపై వివరణ ఇవ్వడం, అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలాంటప్పుడు బంద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ జోక్యంతోనూ మారని పరిస్థితి
వివాదం ముదరకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదివారం వ్యాపారులు, మార్కెట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రికార్డుల తనిఖీ, ఉల్లంఘనలపై నోటీసుల జారీ సాధారణ ప్రక్రియేనని స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు రికార్డులు చూపించేందుకు అభ్యంతరం ఎందుకని వ్యాపారులను కలెక్టర్ ప్రశ్నించారు.
రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వివాదాన్ని పెద్దది చేయొద్దని సూచించారు. కలెక్టర్ జోక్యంతోనూ పరిస్థితిలో మార్పులేదు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ బంద్ నిర్ణయం సోమవారం అమలులోకి రావడంతో చర్చనీయాం శమైంది. కలెక్టర్ నోటీసుల జారీని సమర్థించినప్పటికీ, వాటిని జారీ చేసిన అధికారులే వ్యాపారుల నిరసనను ఎదుర్కోవాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
అధికారుల విధులకు భరోసా ఎక్కడ?
వ్యాపారుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం ఎంత ముఖ్యమో, అధికారుల ఆత్మగౌరవాన్ని కాపాడటం, విధి నిర్వహణకు భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యం. అధికారుల తప్పులుంటే విచారించాలి. వ్యాపారులు ఉల్లంఘనలకు పాల్పడితే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరి ఒత్తిళ్లకూ వ్యవస్థ తలొగ్గకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు, వ్యాపారుల వివాదం నడుమ నలిగిపోతున్నామని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
నోటీసుల నుంచి బంద్ వరకు
తూకాల్లో అక్రమాలపై నోటీసులు ఇవ్వడంపై జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ తో వ్యాపారి లింగారెడ్డి వాగ్వాదానికి దిగిన ఘటనతో తలెత్తిన వివాదం మరింత ముదిరింది. పత్తి బీట్ వద్ద జరిగిన ఘటన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. విధుల్లోని అధికారితో దురుసుగా ప్రపర్తించారనే ఆరోపణలతో లింగారెడ్డిపై ఏనుమాముల పీఎస్‌లో కేసు నమోదైంది. దీంతో వివాదం కాస్త వ్యాపారవర్గాల నిరసనగా మారింది. మార్కెట్ లో కొనుగోళ్ల బంద్ కు దారితీసింది.

