మంత్రి ఇలాకాలో ఫండ్స్ ఫైట్.. రూ.కోట్ల లెక్కలపై రగడ!

‎‎కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీ (Huzurnagar Municipality), మంత్రి ఇలాకాలో నిధుల గోల్‌మాల్ వ్యవహారం చైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లుగా మారింది. పట్టణాభివృద్ధికి వచ్చిన జనరల్, క్యాపిటల్ ఫండ్ల నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు అధికార కాంగ్రెస్ లోనే పెను దుమారం రేపాయి. చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ నిధుల అవకతవకలపై సొంత పార్టీ కౌన్సిలర్లే ప్రత్యక్ష పోరాటానికి దిగడంతో పాలకవర్గం రెండుగా చీలింది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటుండగా జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

మున్సిపాలిటీకి సంబంధించి జనరల్, క్యాపిటల్ ఫండ్ల కింద మంజూరైన రూ. 6 కోట్ల నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు జరిగాయని కౌన్సిలర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆ నిధులకు క్షేత్రస్థాయిలో కేవలం రూ. 3 కోట్లకే లెక్కలు చూపించి, మిగతా నిధులను ఎటు మళ్లించారంటూ నిలదీస్తున్నారు. మరోవైపు పారిశుద్ధ్య నిర్వహణ, కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల్లోనూ భారీగా గోల్‌మాల్ జరిగిందని పేర్కొంటున్నారు. కార్మికులకు జీతాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారనే విమర్శలు తీవ్రమయ్యాయి.

‎‎ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు

‎ఇటీవల నిర్వహించిన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారడంతో వివాదం ఒక్కసారిగా బట్టబయలైంది. చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ “ నేను చెప్పిందే వేదం” అన్నట్లుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఖర్చుల పేరుతో తమను కట్టడి చేసేలా మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు. అసలు రూ. ఆరు కోట్ల నిధులు ఎక్కడ ఖర్చు చేశారో మున్సిపల్ ప్రజలకు పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సోమవారం మున్సిపల్ ఆఫీస్ (Huzurnagar Municipality) ఎదుట ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ల ఆరోపణలను చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వర్గం పూర్తిగా ఖండించింది. మంత్రి చొరవతోనే తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా సమర్థవంతంగా చేపట్టిన పనులు ముందుకు తీసుకెళ్తున్నామని చెబుతున్నారు. మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి జరగలేదని కౌన్సిల్‌లో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశామని స్పష్టం చేశారు. కొందరు స్వార్థపరులు తమ రాజకీయ లబ్ధి కోసం, మున్సిపాలిటీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు.

‎‎అధికారులు మౌనం వెనక..

రూ. ‎కోట్లలో నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై కమిషనర్, ఇతర అధికారులు మౌనంగా ఉండటం వెనక పలు అనుమానాలు వస్తున్నాయి. నిధుల పక్కదారిపై బయటకు పొక్కకుండా అధికారులు కూడా ఆచితూచి వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైర్మన్‌పైనే సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేయడం, నిధుల లెక్కలపై స్పష్టత లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ భారీ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, కౌన్సిలర్లు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>