కలం, మహబూబ్ నగర్ బ్యూరో : నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర అల్పాజోలం తయారీ ముఠా (Alprazolam Gang)ను ఛేదించారు. బిజినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఆపరేషన్ లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బిజినేపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలోని రేకుల షెడ్డులో అల్పాజోలం తయారీ కేంద్రం నడుస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు పథకం ప్రకారం దాడి చేశారు. తొలుత నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.6 కిలోల అల్పాజోలం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.26 లక్షలు. అదనంగా రూ.12 లక్షల విలువైన తయారీ పరికరాలు, కెమికల్స్, పౌడర్, 6 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మొత్తం రూ.38 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ముఠా నెట్ వర్క్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించినట్లు వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని రాయచూర్ నుంచి ముడిసరుకులు సరఫరా అవుతుండగా, ఏపీలోని కడప జిల్లా కూనర్ పల్లిలో ప్రాథమిక దశల్లో తయారీ జరిగి, బిజినపల్లిలో చివరి దశ తయారీ పూర్తి చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కల్లు కాంపౌండ్లకు అల్పాజోలం సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. నిందితుల సమాచారంతో ఏపీలోని కూనర్ పల్లిలో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కీలక నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. కేసును సమర్థవంతంగా ఛేదించిన నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐ అశోక్ రెడ్డి, సీసీఎస్ సీఐ శంకర్, బిజినపల్లి ఎస్సై శంషుద్దీన్ తదితరులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.

