కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లా వ్యాప్తంగా నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల (Cheyutha Pension) మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను అందజేశారు. చొప్పదండి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
చొప్పదండి మున్సిపాలిటీలో 424 మందికి, మండలంలో 490 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంపికైన మహిళలకు కుట్టు మిషన్లను కూడా పంపిణీ చేశారు. గన్నేరువరం మండలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా నూతన పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మండల ప్రత్యేక అధికారి రామానుజాచార్యులు, డీఆర్డీఏ పీడీ మచ్చ గీత, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెజ్జంకి మాతంగి శిరీష తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండల ఎంపీపీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, డీఆర్డీవో ఎం.గీత లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు అందజేశారు. తొలుత ఎమ్మెల్యే మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కరీంనగర్ రూరల్ మండలానికి 477, కొత్తపల్లి మండలానికి 354 పింఛన్లు మంజూరయ్యాయి. హుజూరాబాద్‌లోని ప్రతాప సాయి రెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, ఆర్డీవో జలకుమారి నాయక్ వాడి, మున్సిపల్ కమిషనర్ కిషన్, ఎంపీడీవో సునీతతోపాటు వార్డు సభ్యులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని లబ్ధిదారులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమాల్లో వివిధ మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

