రేవంత్ పాలనపై ఈటల, కాసం సంచలన వ్యాఖ్యలు

కలం, యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రజా సమస్యలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నా ప్రభుత్వానికి మాత్రం చలనం లేదని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar ) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యాదగిరిగుట్ట లో నేడు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య తలెత్తినా దానికి బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులపై నెపం నెట్టి రాజకీయ ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలు ఒకవైపు.. ప్రభుత్వ రాజకీయ ప్రచారం మరోవైపు అన్నట్లుగా పాలన సాగుతోందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ముందస్తు హెచ్చరికలు బేఖాతర్

ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం అప్రమత్తం కాలేదని కాసం ఆరోపించారు. తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాలు, విద్యుత్ కొరత వంటి సమస్యలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని తాను స్వయంగా ప్రభుత్వాన్ని హెచ్చరించానని గుర్తుచేశారు. అయినా ముందస్తు కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు. నేడు హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు నీటి సమస్యలు, బోర్లు, బావులు ఎండిపోవడం, హాస్టల్ విద్యార్థుల ఇబ్బందులు ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు.

అన్నదాతకు అండ ఎక్కడ?

రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు తెరిచామని చెప్పుకోవడమే తప్ప అక్కడ గన్నీ బ్యాగులు, కాంటాలు, తార్పాలిన్లు, హమాలీల వ్యవస్థ లేకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతుకు మిగిలిన ధాన్యాన్ని అమ్ముకోవడమే యుద్ధంగా మారిందని వ్యాఖ్యానించారు. రైతాంగ సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనే కనీస బాధ్యతను కూడా ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

దేశ ప్రతిష్టపై రాజకీయ పోరాటమా?

ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన కాంక్లేవ్‌పై కూడా కాసం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం, విద్యార్థుల సమస్యలు, పరిశ్రమల స్థాపన వంటి అంశాలు పరిష్కారం కోసం ఎదురుచూస్తుంటే కాంగ్రెస్ నాయకత్వం జాతీయ రాజకీయాలపై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ అంతర్జాతీయ వేదికలపై భారత ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్ణాటక రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి కాసం వెంకటేశ్వర్లు కూడా కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో గతంలో చోటుచేసుకున్న ఎల్ఐసీ, జీపుల కొనుగోళ్లు, బోఫోర్స్, 2జీ, బొగ్గు కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఆ పార్టీ చరిత్రలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని కాసం వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కాంగ్రెస్ తన పాలనను సమీక్షించుకోవాలని హితవు పలికారు.

2028 ఎన్నికలే టార్గెట్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలతో కాలం గడపడం మానుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట నుంచి వినిపించిన ఈ రాజకీయ విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ పోరుకు మరో వేదికగా మారాయి. నీటి సమస్యలు, రైతుల ధాన్యం కొనుగోళ్లు, నిరుద్యోగం.. ఈ మూడు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీజేపీ తన రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే సంకేతాలను ఈ సమావేశం ఇచ్చింది. ఈ మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్ణాటక సహ ఇన్‌ఛార్జి కాసం వెంకటేశ్వర్ల తో పాటు జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీను, మండల అధ్యక్షుడు గుంటిపల్లి సత్యం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>