ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.. వీరయ్యకు సీపీఐ వినతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు రక్షణ కవచంలా ఉన్న పెసా చట్టానికి అటవీ శాఖ అధికారులు తూట్లు పొడుస్తున్నారని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ (CPI New Democracy) నాయకులు మండిపడ్డారు. గ్రామసభ తీర్మానం లేకుండా గిరిజనుల పోడు భూముల్లో అక్రమంగా మొక్కలు నాటిన బాధ్యులైన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అటవీ హక్కుల చైర్మన్ పొడెం వీరయ్యకు సోమవారం వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్, చర్ల మండల కార్యదర్శి సంతపూరి సురేష్ మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలం చిన్నమిడిసిలేరు గ్రామంలో గిరిజనుల సంతకాలు, తీర్మానం లేకుండా వారు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో మొక్కలు నాటడం పెసా చట్టాన్ని, అటవీ హక్కుల చట్టం-2006ను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో ఎర్రబోడులో జరిగిన ఘటనను సాకుగా చూపుతూ అప్పటి నుండి చిన్నమిడిసిలేరులో పోడు సర్వేను నిలిపివేశారని, గ్రామంలోని గిరిజనులను రెండు వర్గాలుగా విడదీసి ఒక వర్గానికే పట్టాలిచ్చి మరో వర్గానికి అన్యాయం చేశారని ఆరోపించారు.

​పోడు భూములపై సర్వే చేసి నివేదిక పంపాలని ఐటీడీఏ పీఓ ఆదేశించినప్పటికీ, ఫారెస్ట్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కేసులు పెడతామని, రేషన్ కార్డులు రద్దు చేస్తామని రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ఆ మొక్కలను తొలగించి, సమగ్ర సర్వే నిర్వహించి పట్టాలు ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీనిపై చైర్మన్ పొడెం వీరయ్య సానుకూలంగా స్పందించి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, లేనిపక్షంలో ఫారెస్ట్ అధికారులపై గిరిజనుల తిరుగుబాటు తప్పదని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల కార్యదర్శి కొంజ జోగారావు, రామకృష్ణ, జానకి, వెంకటమ్మ, రామలక్ష్మి, తుర్రం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>