కలం, కరీంనగర్ బ్యూరో : ఇచ్చిన హామీ ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను (NHM Employees) తక్షణమే క్రమబద్ధీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమ్మె కాలంలో నిలిపివేసిన వేతనాలను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగుల పక్షాన తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఎన్హెచ్ఎం ఉద్యోగ సంఘం జేఏసీ అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు కరీంనగర్‌లోని తన నివాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులందరికీ 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కోరారు. జీవో నెం.60ను అమలు చేయడంతోపాటు, జీవో నెం.1195 ప్రకారం వేతనాలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీ (SHS) పరిధిలోకి తీసుకురావాలని కోరారు.
అలాగే SPARSH విధానం ద్వారా జీతాలు చెల్లించాలని, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సమ్మె కాలానికి సంబంధించిన పూర్తి వేతనాన్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఈ హామీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, 90 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందునే సమ్మెను విరమించామని ఉద్యోగులు తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యోగుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.

