కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉత్తమమైన వ్యక్తిత్వంతో కూడిన పౌరులను సమాజానికి అందించాలంటే బడి, గుడి రెండు కళ్లలాంటివేనని, బడిలో నేర్చుకున్న విలువలు గుడిలోనూ, గుడిలో నేర్చుకున్న ఆధ్యాత్మికత బడిలోనూ ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని 7వ డివిజన్ పరిధిలో శ్రీ చంద్ర కాలనీ లో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆలయ నిర్మాణం ద్వారా కాలనీ వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఏకతాటిపైకి రావడం అభినందనీయమన్నారు. “బడి దగ్గర, గుడి దగ్గర, డాక్టర్ దగ్గర, న్యాయవాది దగ్గర కులం ప్రస్తావన ఉండదని అన్నారు. అలాంటిది కులాన్ని తీసుకొచ్చి అన్నింటికీ ఆపాదిస్తే మనం చాలా చిన్న మనుషులుగా ఆలోచిస్తున్నట్లే లెక్క” అని ఆయన హితవు పలికారు. మనుషులంతా ఆ పరమాత్ముని దీవెనతో భూమిపైకి వచ్చారని, అందరూ ఈ భూతల్లి బిడ్డలేనని గ్రహించి అందరూ కలిసి మెలిసి జీవించాలని సూచించారు. మనలో మనం గీతలు గీసుకోవాల్సిన అవసరం లేనేలేదని, అన్ని ధార్మిక శాస్త్రాలు, గ్రంథాలు బోధిస్తున్నాయని గుర్తుచేశారు.
మనుషులంతా ఒక్కటేనని మనస్ఫూర్తిగా నమ్మేవారికే భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆయన అన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తయి, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం మరింత వైభవంగా జరగాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అతిథులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, కార్పొరేటర్లు కుర్వ మంజుల శ్రీశైలం, రామస్వామి, ఆలయ కమిటీ చైర్మన్, కార్యకర్తలు, కాలనీ పెద్దలు, స్థానిక నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

