కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ రైల్వే ట్రాక్ పేల్చివేత (Railway Track Blast) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ట్రాక్ పేల్చివేతకు పాల్పడిన 21 ఏళ్ల మహక్‌దీప్ కౌర్ అనే యువతి, 23 ఏళ్ల దవీందర్ సింగ్‌ను రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలా కుట్రకు పాల్పడ్డారనేది అడిషనల్ డీజీపీ దినేష్ తెలిపారు.
‘పంజాబ్‌కు చెందిన మహక్‌దీప్ కౌర్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చాచా, షా అనే పేర్లతో సోషల్ మీడియా ద్వారా పరిచయమై.. రొమాంటిక్ రిలేషన్‌లోకి దించారు. తాము చెప్పినట్లు చేస్తే, భారీగా డబ్బులు ఇస్తామని ఆశ చూపారు. మహక్‌దీప్ కౌర్‌కు రూ.30 వేలు పంపించి రైల్వే ట్రాక్ పేల్చేయాలని సూచించారు. ఇందుకు దవీందర్ సింగ్ సైతం సహకరించాడు’ అని అడిషనల్ డీజీపీ దినేష్ వివరించారు.
మూడో సారి విజయవంతం..
పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ల సూచనల మేరకు ట్రాక్ పేల్చేందుకు మహక్‌దీప్ కౌర్, దవీందర్ సింగ్ రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. నవంబర్ రెండో తేదీన విజయవంతంగా ట్రాక్ పేల్చేసి అక్కడి నుంచి పరారయ్యారు. మొదటగా ఇది సాధారణ ఘటనగా భావించినప్పటికీ, లోతుగా దర్యాప్తు చేయడంతో దీనిలో కుట్ర కోణం బయటపడిందని అడిషనల్ డీజీపీ దినేష్ వివరించారు. ఐఎస్ఐ ఏజెంట్లు మాత్రమే ఇలా మారు పేర్లు పెట్టుకుని, రిక్రూట్ చేసుకుంటారని చెప్పారు.
మహక్‌దీప్ కౌర్ భర్త గంజాయి కేసులో అరెస్టయి జైల్లో ఉండటంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉంటోందన్నారు. ఇలా ఒంటరిగా ఉన్న మహిళలను పాకిస్థాన్ ఏజెంట్లు టార్గెట్ చేసి, తమ కుట్రలోకి దించుతున్నారని వెల్లడించారు. మహక్‌దీప్ కౌర్, దవీందర్ సింగ్ నుంచి రెండు పిస్తోళ్లు, 46 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో ప్రవేశ పెట్టి, మరోసారి కస్టడీకి తీసుకుంటామని అడిషనల్ డీజీపీ దినేష్ స్పష్టం చేశారు.

