కలం, ఖమ్మం బ్యూరో: క్షణాల్లో ఖాతా ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు (Kothagudem Police) అంతే వేగంతో చెక్ పెట్టారు. ‘గోల్డెన్ అవర్’లో బాధితుడు చేసిన ఒక్క ఫోన్ కాల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేక పర్యవేక్షణ తోడవడంతో సైబర్ కేటుగాళ్ల ఆటలు సాగలేదు. క్రెడిట్ కార్డు మోసంలో రూ.4,97,526 కోల్పోయిన బాధితుడికి ఆ మొత్తం సొమ్మును సురక్షితంగా కాపాడి పోలీసులు భరోసానిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది.
అశ్వాపురం పరిధిలోని హెవీ వాటర్ ప్లాంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్న సుశీల్ కుమార్ క్రెడిట్ కార్డును లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు (Cyber Credit Card Fraud) ఈ నెల 8వ తేదీన నాలుగు విడతల్లో రూ.4,97,526 నగదును కాజేశారు. ఖాతా నుంచి డబ్బులు మాయమైనట్లు గుర్తించిన సుశీల్ కుమార్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు అందిన వెంటనే జిల్లా సైబర్ క్రైమ్ సెల్ అధికారులు మెరుపు వేగంతో స్పందించారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో లావాదేవీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత బ్యాంకు అధికారులతో తక్షణమే సమన్వయం చేసుకున్నారు. నేరగాళ్ల ఖాతాల్లోకి మళ్లిన నగదు విత్డ్రా కాకుండా నిలువరించేందుకు పక్కాగా చర్యలు చేపట్టారు. పోలీసుల చొరవతో రూ.1,62,470 నేరుగా బాధితుడి ఖాతాలోకి రిఫండ్ కాగా, మిగిలిన రూ.3,35,056 నగదును ఆయా బ్యాంకు ఖాతాల్లో హోల్డ్ చేయించారు.
దీంతో బాధితుడు కోల్పోయిన మొత్తం రూ.4,97,526 సొమ్ముకు పూర్తి రక్షణ లభించింది. ఈ ఘటనపై అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ఈ నెల 9వ తేదీన బీఎన్ఎస్ సెక్షన్ 318(4), ఐటీ యాక్ట్ 66(C), 66(D) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితుడి సొమ్మును కాపాడటంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కే. నరేష్, ఎస్ఐ ఎస్.కే. జుబేదా, సిబ్బంది డి. వంశీకృష్ణ, బి. శ్రావణ్ కుమార్, వి. రజిత, సుప్రియ సమన్వయంతో పనిచేసి కీలక పాత్ర పోషించారు.
సైబర్ మోసాలకు గురైన బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్ అవర్’లోపు 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేస్తే నగదు రికవరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. అపరిచిత లింకులను క్లిక్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఇతరులకు వెల్లడించడం వంటి పొరపాట్లు చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

