కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే యువత గొంతుకగా ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy) అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతి కార్యక్రమానికి హాజరై విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాన్-టీచింగ్ స్టాఫ్‌తో ఆయన సమావేశమయ్యారు. విద్యార్థులు విశ్వవిద్యాలయంలో నెలకొన్న పలు సమస్యలను, తమ అభిప్రాయాలను ఆయనతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..తన అభ్యర్థిత్వంతో యువతకు ఒక గొప్ప అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. స్వతహాగా విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిగా రాష్ట్రంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు.
రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే, చట్టసభల్లో యువత , పట్టభద్రుల గొంతుకను బలంగా వినిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పీయుజేసీ కన్వీనర్ సాయి అభినయ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బత్తిని రాము, ఎస్ఎఫ్ఐ అంజి, ఏఐఎస్ఎఫ్ ఉదయ్, ఎంఎస్ఎఫ్ ప్రదీప్, సుధాకర్ పీడీఎస్‌యూ నరసింహ, విద్యుల్లత, బీసీ సంఘం శివాజీ, తదితరులు పాల్గొన్నారు.

