సైబర్ నేరాలపై నిజామాబాద్ సీపీ అవగాహన

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య (CP Sai Chaitanya) విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నవంబర్ నెలను సైబర్ అవగాహన మాసంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీపీ ముఖ్య అతిథిగా హాజరై సైబర్ నేరాలపై మాట్లాడారు. సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, మెసేజింగ్ యాప్‌ల్లో డిస్కౌంట్, మెగా సేల్ వంటి ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి, ముందస్తు చెల్లింపులు తీసుకుంటారని వివరించారు. ఆ తర్వాత నకిలీ ఆర్డర్ వివరాలు చూపి, డెలివరీ ఆలస్యమైందని కారణాలు చెప్పి, చివరకు ఫోన్ నంబర్ బ్లాక్ చేసి అదృశ్యమవుతారని హెచ్చరించారు. ప్రతి చెల్లింపు ముందు విక్రేత వివరాలు, కస్టమర్ రివ్యూలు, రేటింగ్‌లు చూడాలని సూచించారు.

APK ఫైళ్లు పంపిస్తూ..

కార్డు పరిమితి పెంపు, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు పేరుతో ఫిషింగ్ లింకులు, APK ఫైళ్లు పంపిస్తున్నారని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. కార్డు నెంబర్, ఓటీపీ, పిన్ వంటి వివరాలను సేకరిస్తారని, వాటితో బాధితులకు తెలియకుండానే ఆన్‌లైన్ కొనుగోళ్లు చేస్తారని వివరించారు. బ్యాంకు నుంచి లావాదేవీ అలర్ట్ వచ్చినప్పుడు లేదా ఖాతా నుంచి డబ్బు తగ్గినప్పుడు మాత్రమే బాధితులకు మోసం తెలుస్తుందన్నారు. దీనిని నివారించడానికి, తెలియని వనరుల నుంచి APK ఫైళ్లు, యాప్‌లు ఇన్‌స్టాల్ చేయొద్దన్నారు. బ్యాంకు స్టేట్‌మెంట్లు, అలర్ట్‌లను క్రమం తప్పకుండా పరిశీలించాలని, అనధికార లావాదేవీ జరిగితే వెంటనే కార్డును బ్లాక్ చేసి, బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేశారు.

నకిలీ ట్రేడింగ్ యాప్‌లో..

స్టాక్ నిపుణులుగా నటించి నకిలీ ట్రేడింగ్ యాప్‌లో లాభాలు చూపి, మరింత పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. పెద్ద మొత్తం జమ అయ్యాక విత్‌డ్రాలను నిలిపివేసి అదృశ్యమవుతారని తెలిపారు. వీటిని నివారించాలంటే సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో వచ్చే స్టాక్ చిట్కాలను నమ్మవద్దన్నారు. అసాధారణంగా అధిక రాబడి, గ్యారంటీ లాభాల హామీలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయాలన్నారు. www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయొచ్చని వివరించారు. ఈ సందర్భంగా సైబర్ అవగాహన పోస్టర్లను సీపీ సాయి చైతన్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ , సీసీపీఎస్ ఇన్‌స్పెక్టర్ మొఖీద్ పాషా , త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ హరిబాబు, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ రవికుమార్, పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ రాజన్న హాజరయ్యారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>