కలం, నిర్మల్ : జిల్లాలో అక్రెడిటేషన్ కార్డుల(Accreditation Cards) జారీ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అక్రెడిటేషన్ కమిటీ మూడో విడత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందిన దరఖాస్తులను పరిశీలించి, అర్హతలు, నిబంధనల అమలుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జర్నలిస్టులు వృత్తి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజూ దినపత్రికల ప్రచురణ, హాజరు వివరాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందినట్లు గుర్తిస్తే వాటిని రద్దు చేస్తామని తెలిపారు. అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కార్డులను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అక్రెడిటేషన్ కన్వీనర్ మెంబర్, డీపీఆర్ఓ విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

