కలం, బోనకల్: రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ రైతు సంఘం నేతలు మండిపడ్డారు. నవంబర్ 15 నుంచి 18 వరకు తెలంగాణలో అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహాసభలను, నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు, పోస్టర్ ఆవిష్కరణలు జోరుగా సాగుతున్నాయి.
రైతు వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు కార్యాచరణ..
కారేపల్లిలో ఎండీ ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగిన రైతు బహిరంగ సభ సన్నాహక విస్తృత సమావేశంలో రైతు సంఘం వైరా డివిజన్ సహాయ కార్యదర్శి భూక్య వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 40 సంవత్సరాల తర్వాత తెలంగాణ గడ్డపై ఈ మహాసభలు జరుగుతుండటం చారిత్రాత్మకమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఈ సభల్లో తీవ్రంగా చర్చించి, భవిష్యత్తు పోరాటాలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులు, వర్షాభావం, తుఫాన్ల కారణంగా వాటిల్లిన పంట నష్టాలు, అలాగే అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రభావంతో పత్తి, పాల ఉత్పత్తిదారులు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చిస్తామని వెల్లడించారు. భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి, పేద రైతులను భూములకు దూరం చేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేయడం, ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను ఎండగడుతూ రైతాంగం ఐక్యంగా పోరాడాలని కోరారు. ప్రాజెక్టుల పేరుతో అధికారంలోకి వచ్చి, వాటిని పూర్తి చేయకుండా సాగు, తాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
బోనకల్లో పోస్టర్లు ఆవిష్కరణ, విస్తృత ప్రచారం..
మధిర డివిజన్ పరిధిలోని బోనకల్ మండలం ముష్టికుంట్ల సీపీఎం కార్యాలయంలో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు, బహిరంగ సభ పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ప్రచారం, సమావేశాలు, కరపత్రాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. నల్లగొండలో జరిగే బహిరంగ సభకు బోనకల్ మండలం నుంచి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని కోరారు. ఇందులో భాగంగా ఈ నెల 12న బోనకల్ సీపీఎం కార్యాలయంలో రెడ్షర్ట్ వాలంటీర్ల కవాతు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ సన్నాహక కార్యక్రమాలలో రైతు సంఘం జిల్లా నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, కిలారు సురేష్, వైరా డివిజన్ కార్యదర్శి దుర్గి కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు, సీఐటీయూ మండల కన్వీనర్ కె. నరేంద్ర, డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు, కె. ఉమావతి, రేగళ్ల మంగయ్య, ధరావత్ వినోద్ కుమార్, కొంగర వెంకటనారాయణ, బంధం శ్రీనివాసరావు, దొప్ప కొరివి వీరభద్రం తదితర నాయకులు పాల్గొన్నారు.

